రోడ్ల మీద సంగీతం తరువాత...ముందు సరైన రోడ్లు వేయించండి

Update: 2023-07-26 09:17 GMT

వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తుంటారు. ప్రపంచంలో జరిగే అన్ని విషయాల మీద స్పందిస్తుంటారు. తాజాగా ఆయన పెట్టిన ఓ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

హంగరీలోని ఓ రోడ్ గురించి ఆనంద్ మహీంద్రా పోస్ట్ పెట్టారు. ఇదొక మ్యూజికల్ రోడ్. అక్కడ ఓ హైవే మీద వెళుతుంటే ఆ కంట్రీకి సంబంధించిన జానపదగీతం వినిపిస్తూ ఉంటుంది. ఈ రోడ్డు ఆనంద్ కు చాలా నచ్చేసింది. అదే విషయాన్ని పోస్ట్ చేస్తూ...కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీని కూడా ట్యాగ్ చేశారు. మన జాతీయ రహదారులకు కూడా ఇలా సంగీతాన్ని వినిపించే చర్యలు తీసుకుంటే బావుంటుందన్నారు. అయితే రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఏ పాట, ఏ సంగీతం వినిపించాలనేది కొంచెం కష్టమైన విషయమే. ఎందుకంటే మనకు రాష్ట్రాలను బట్టి మారుతుందేమో అంటూ ఫన్నీగా రాసుకొచ్చారు.

ఆనంద్ పెట్టిన ఈ వీడియో మీద నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది సరదాగా పోస్ట్ పెడుతుంటే మరికొంతమంది మాత్రం బాబూ రోడ్డు మీద సంగీతం తరువాతి సంగతి కానీ ముందు సరైన రోడ్లు, సౌకర్యాలు వేయించండి మీకు పుణ్యం ఉంటుంది అని కామెంట్లు పెడుతున్నారు.

Tags:    

Similar News