కొన్ని గంటల్లో పెళ్లి.. అన్ని ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. వధూవరుల ఇళ్లు బంధువుల కోలాహలంతో సందడిగ ఉన్నాయి. ఇంతలో వధువు అందరికీ షాక్ ఇస్తూ ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎంత వెతికినా దొరకలేదు. వరుడి కుటుంబానికి ఏం చెప్పాలో తెలియక తల్లిదండ్రులు ఆందోళన పడ్డారు. చివరకు వరుడిని ఒప్పించి వేరే అమ్మాయితో పెళ్లి జరిపించారు. ఆ తర్వాత పారిపోయిన యువతి ఆచూకీ దొరికింది. అయితే ఆమె చెప్పింది విని అందరూ ఆశ్చర్యపోయారు.
ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్‌కు చెందిన యువతికి మీర్జాపూర్‌కు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. జూన్ 3న వీరి పెళ్లికి ముహూర్తం ఖరారైంది. పెళ్లి రోజు రానే వచ్చింది.. కుటుంబసభ్యులు, బంధువుల హడావుడితో సందడి నెలకొంది. అయితే ఇంతలోనే వధువు అందరికీ షాక్ ఇస్తూ సడెన్గా కన్పించకుండా పోయింది. చుట్టుపక్కల ఎంత వెతికినా కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు అమ్మాయి కోసం గాలింపు చేపట్టారు.
ఈ క్రమంలో వరుడి కుటుంబానికి ఏం చెప్పాలో తెలియక వధువులు తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చివరకు తమ బంధువుల్లోని ఓ యువతితో వివాహానికి వరుడిని ఒప్పించారు. దీనికి అంతా అంగీకరించడంతో అదే ముహూర్థానికి వివాహం జరిగిపోయిది. ఆ తర్వాత పారిపోయిన వధువును గ్రామంలోని పాఠశాలలోనే పోలీసులు గుర్తించారు. దీంతో ఆమె చెప్పింది విని అందరూ ఆశ్చర్యపోయారు. తాను యూపీఎస్సీకి ప్రిపేర్ కావాలనుకుంటున్నానని, ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పినా వినిపించుకోకుండా పెళ్లికి బలవంతంగా ఒప్పించారని సదరు యువతి చెప్పింది. ఈ నేపథ్యంలో ఏంచేయాలో తెలియక తానే ఇంటి నుంచి పారిపోయానని, ఎవరి బలవంతమూ లేదని వివరించింది.