సింగిల్‌గా వచ్చి బర్రెల చేతిలో ఖతమైన పులి.. వీడియో వైరల్

Update: 2023-07-22 02:39 GMT

‘‘సింహం సింగిల్‌గా వస్తుంది, పందులే గుంపులుగా వస్తాయి,’’ అని ఓ ఫేమస్ సినిమా డైలాగ్ ఉంది. కానీ గుంపు బలం ముందు సింహాల, పులుల, ఏనుగుల కథ నడవదు. ఐకమత్యమే మహాబలం అని సన్నజీవాలు ఎదురుతిరిగితే తోక ముడవాల్సిందే. అందుకే ‘‘బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతీ’’ అని అన్నారు. విషయం ఏమంటే.. బర్రెలను కమ్మగా భోంచేద్దామని వచ్చిన ఓ పులిరాజు వాటి చేతిలోనే ఖతమయ్యాడు. బర్రెలన్నీ ఏకమై పులిని కుమ్మేశాయి. పులి ఆకలి బాధ, బర్రెల ఆత్మరక్షణ గోల వెరసి అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మహారాష్ట్రలోని చంద్రాపూర్ అడవుల్లో జరిగిన ఈ సంఘటన వీడియో సోషల్ మీడియోలో హల్ చల్ చేస్తోంది.

గురువారం ఉదయం మూల్ తాలూకాలో ఎసగ్రావ్‌లో ఓ పెద్దపులి ఓ పసువుల కాపరిపై దాడి చేసింది. అతడు భయపడకుండా చేతిలో ఉన్నగొడ్డలి విసరి పారిపోయాడు. తర్వాత ఆకలి తీరని పులి బెంబడా గ్రామ శివారులో మేత మస్తున్న బర్రెల, ఆవుల మందపై దాడి చేసింది. బర్రెలు ఊహించని విధంగా అన్నీ ఏకమై కొమ్ములతో దాడి చేశాయి. బిక్కచచ్చిన పులి గాయాలతో నెత్తురోడుతూ కుప్పకూలింది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు చంద్రపూర్‌ ఆస్పత్రికి తరలించగా అక్కడే చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ వీడియోపై జనం నానా కామెంట్లూ చేస్తున్నారు. ఐకమత్యానికి ఇది బలమని కొందరు అంటుంటే, మరి పులి ఆకలి తీరేదెలా అని మరికొందరు అంటున్నారు. బర్రెలన్నీ కలసి ఒక బర్రెను అప్పజెప్పి ఉంటే సరిపోయేదని మరికొందరు జోకుతున్నారు.

Tags:    

Similar News