బైక్కు గుడి కట్టి పూజలు.. సినిమాని మించిన స్టోరీ

Update: 2023-07-11 16:01 GMT

దేవుళ్లకు గుడి కడతాం .. అభిమానం ఎక్కువైతే నాయకులకు, సినిమా తారలకు కడతాం.. అయితే ఓ చోట బైక్కు గుడి కట్టారు. బుల్లెట్ బండికి గుడి కట్టి.. దానికి బుల్లెట్ బాబా అని పేరు పెట్టారు. వాహనప్రియులు ఎక్కువగా ఇష్టపడే ద్విచక్ర వాహనాల్లో బుల్లెట్ బండి ఒకటి. బుల్లెట్ బండిపై కొన్ని పాటలు కూడా వచ్చాయి. కానీ రాజస్థాన్లోని పాలీ జిల్లాలో దానికి గుడి కట్టి పూజించడం ఆసక్తికరంగా మారింది. ప్రజలు దీనికి నిత్య పూజలు చేస్తుంటారు.

1980 దశకం చివరలో చోటిలా ఓం సింగ్ రాథోడ్ అనే యువకుడు తన బుల్లెట్ బండిపై వెళ్లేటప్పుడు ఒక చెట్టుకు ఢీ కొని చనిపోయాడు. ప్రమాదం జరిగిన తరువాత పోలీసులు ఆ బైకుని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అయితే ఆశ్చర్యకరంగా ఆ బుల్లెట్ బైక్ మరుసటి రోజు ప్రమాదం జరిగిన చోటుకే చేరిందట. ఇది ఎవరో ఆకతాయిల పని అని భావించి పోలీసులు మళ్ళీ ఆ బైకుని స్టేషన్‌కి తీసుకెళ్లారు. అయితే ఆ తర్వాత రోజు కూడా బండి ప్రమాదం జరిగిన చోటుకే చేరింది.

ఈ సంఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ తరువాత ఓం సింగ్ రాథోడ్‌కు నివాళులర్పించారు. అయితే ఓం సింగ్ ఆత్మ బుల్లెట్ బండిపై తిరుగుతుందని నమ్మి ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే బండికి గుడి కట్టారు. ఈ గుడికి బుల్లెట్ బాబా అని పేరు పెట్టి నిత్యం పూజలు చేయడం స్టార్ట్ చేశారు. ఈ ఆలయంలో అగరబత్తులు వెలిగించడం, బైక్ చుట్టూ ప్రదక్షిణలు చేయడం, మద్యం పోయటం వంటివి చేస్తుంటారు. ఈ విధంగా చేస్తే భక్తులకు ప్రయాణ సమయంలో ఎటువంటి ప్రమాదాలు జరగవని స్థానికుల నమ్మకం.



Tags:    

Similar News