చిత్ర పరిశ్రమలో తన అపురూపమైన అందం, నటనతో అగ్రతారగా తనకంటూ క్రేజ్‌ను సంపాదించుకున్నారు దివంగత నటి శ్రీదేవి. ఆమె మరణించినా సినీ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఎందుకంటే ఆమె చరిష్మా అలాంటిది. నటిగా ఎంతో మంద్రి అగ్ర కథానాయకులతో ఎన్నో మరుపురాని చిత్రాల్లో నటించారు. 2018లో ప్రమాదవశాత్తు ఆమె మరణించారు. అయినప్పటికీ సినీ ఇండస్ట్రీ ఆమెను సందర్భం వచ్చిన ప్రతిసారి గుర్తు చేసుకుంటుంది. ఇవాళ అతిలోకసుందరి శ్రీదేవి 60వ జయంతి . ఈ నేపథ్యంలో గూగుల్ ఆమెకి ఘన నివాళి తెలిపింది. ఆమె పుట్టినరోజును సందర్భంగా డూడూల్ ద్వారా ఆమెకు అరుదైన గౌరవాన్ని అందించింది. శ్రీదేవి చనిపోయిన ఐదేళ్లకు ఆమెకు ఇలాంటి గౌరవం లభించడంతో ఆమె ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి చిత్రాన్ని గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో చూస్తూ అభిమానులు మురిసిపోతున్నారు. శ్రీదేవి డూడుల్ ఫోటోను ముంబై కి చెందిన ప్రముఖ యానిమేటర్ డిజైనర్ భూమిక ముఖర్జీ అందంగా తీర్చిదిద్దారు.
శ్రీదేవి తమిళనాడులో పుట్టింది. ఆమె అయ్యంగార్ ఫ్యామిలీకి చెందిన వారు. శ్రీదేవి మొదటి పేరు శ్రీ అమ్మయాంగర్ అయ్యప్పన్. అయితే చిత్ర పరిశ్రమలోకి రాగానే పేరు మార్చుకున్నారు. ఆమె టీనేజ్‌లోనే స్టార్ హీరోయిన్ అయ్యింది. అప్పట్లో ఆమె అందానికి కుర్రకారు ఫిదా అయ్యేది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ ఇలా అన్ని భాషల్లోనే వందలాది సినిమాల్లో హీరోయిన్గా నటించి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. భారత్‌లోనే కాదు శ్రీదేవికి వరల్డ్ వైడ్‌గా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలిన మహారాణి శ్రీదేవి. అప్పట్లో బాలీవుడ్ బడా ప్రొడ్యూజర్ బోనీ కపూర్‌ని పెళ్లాడింది. అందాల తారకు ఇద్దరు అప్సరసలు పుట్టారు. పెద్ద కూతురు జాన్వీ కపూర్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటోంది. చిన్న కూతురు ఖుషీ కపూర్ త్వరలో తెరముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది.
ఇదిలా ఉంటే గూగుల్ తన డూడుల్‌గా శ్రీదేవి ఫొటోని డిస్‌ప్లే చేసి ఆమెకు అరుదైన గౌరవాన్ని అందించింది. మంచి కలర్‌ఫుల్ పిక్చర్ అందరిని అమితంగా ఆకట్టుకుంటోంది. ఆమె నృత్యం చేస్తున్నట్లు ఉన్న ఈ ఫోటో ఆమె నటించిన 'దేవత' సినిమాలోని 'ఎల్లువచ్చే గోదారమ్మ' పాటను మరోసారి గుర్తొస్తోంది. ఇప్పుడీ విషయం వరల్డ్ వైడ్‌గా వైరల్ అవుతోంది. ఇలా గూగుల్ శ్రీదేవిని గౌరవించడం పట్ల ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.