దేవుడా? ఎందుకింత పైశాచికం.. మిరప + మూత్రంతో
మనవత్వం మరోసారి సిగ్గుతో తలను బద్దలుకొట్టుకుని చచ్చిపోయింది. అసలు మనిషి అనే పదానికే అర్థం లేని దారుణం జరిగింది. దొంగతనం చేశారనే అనుమానంతో కొందరు అత్యంత దుర్మార్గానికి తెగబడ్డారు. ఇద్దరు బాలురను మాటల్లో చెప్పలేని చిత్రహింసలకు గురిచేశారు. వారితో బలవంతంగా మూత్రం తాగించడంతోపాటు మలద్వారంలో మిరపకాయలు రుద్దారు. ఏదో గుర్తుతెలియని ఆకుపచ్చ పదార్థాన్ని కూడా ఇంజెక్ట్ చేశారు. దీనికి సంబంధించి వీడియో మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్ జిల్లా పత్రాబజార్‌లోని ఆర్షన్ చికెన్ సెంటర్లో ఈ నెల 4వ తేదీన ఈ ఘోరం జరిగింది. చోరీ చేశారనే అనుమానంతో పదేళ్లు, పదిహేనేళ్ల వయసున్న ఇద్దరు మగపిల్లలను ఆరుగురు నీచులు చిత్రహింసలకు గురిచేశారు. పిల్లలు బాధ భరించలేక రోదిస్తున్నా విడిచిపెట్టకుండా హింసించారు. ఆ దారుణాన్ని వీడియో కూడా తీసి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. పోలీసుల దృష్టికి రావడంతో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. దర్యాప్తు జరుగుతోందని, పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తామని ఏఎస్పీ చెప్పారు. యూపీ, మధ్యప్రదేశ్, ఏపీ తదితర రాష్ట్రాల్లో కొన్నాళ్లుగా బడుగు బలహీన వర్గాల వారిపై మూత్రం పోయడం, దాడులకు పాల్పడుతుండడం తెలిసిందే. అరెస్టులు, బెయిళ్లు తప్ప కఠినశిక్షలు పడకపోడంతో మరిన్ని అమానుష ఘటనలు సాగుతున్నాయి.