వీడు మామూలోడు కాదు.. రెండేళ్లుగా 5 స్టార్ హోటల్‌లో ఫ్రీ గా ఉంటూ..

Update: 2023-06-21 07:47 GMT

మామూలుగా ఏ అర్భన్ ఏరియాలోని చిన్న హోటల్‌కు లేదంటే చిన్న లాడ్జికి వెళ్లినా.. ఎంతో కొంత పే చేస్తేనే అక్కడ ఉండనిస్తారు. లేదంటే దోబ్బేయమంటారు. కానీ ఒక వ్యక్తి ఫైవ్ స్టార్ హోటల్‌లో ఒకటి కాదు, రెండు కాదు ఎటువంటి రెంట్ చెల్లించకుండా ఏకంగా రెండేళ్లు ఫ్రీగా ఉన్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (IGI) విమానాశ్రయానికి సమీపంలోని ఏరోసిటీలో రోసియేట్ హౌస్ (Roseate) అనే హోటల్ ఉంది. తమ హోటల్ లో 603 రోజుల పాటు ఉన్న అంకుష్ దత్తా అనే వ్యక్తి .. ఒక్క పైసా కూడా చెల్లించకుండానే వెళ్లిపోయాడని రోసియేట్ హౌస్ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. అతడు రూ. 58 లక్షల బిల్లును తమకు కట్టాల్సి ఉందని చెప్పారు. దీనిపై వారు IGI ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

అంకుష్ అన్ని రోజులు ఉచితంగా హోటల్ లో ఉండటానికి.. హోటల్ లో ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్‌మెంట్ హెడ్ గా పనిచేస్తున్న ప్రేమ్ ప్రకాష్ అనుమతించాడని రోసియేట్ హౌస్ హోటల్ నిర్వాహకులు ఎఫ్‌ఐఆర్ లో ఆరోపించారు. ఇందుకోసం హోటల్ కంప్యూటర్ సిస్టమ్‌ను ప్రేమ్ ప్రకాష్ దుర్వినియోగం చేశాడని.. కస్టమర్ల వివరాలు నమోదు చేసే సాఫ్ట్ వేర్ లో కూడా అంకుష్ దత్తా పేరు, రూమ్ నంబర్ లేకుండా చేశాడని పేర్కొన్నారు. ఈ పనిని చేసిపెట్టినందుకు దత్తా నుంచి ప్రకాష్ ఎంతో కొంత లంచంగా తీసుకొని ఉండొచ్చని ఆరోపిస్తున్నారు.

2019 మే 30న హోటల్ లోకి వచ్చిన దత్తా ఒక రాత్రి కోసం గదిని బుక్ చేసుకున్నాడని.. కానీ అతడు 2021 జనవరి 22 వరకు అదే గదిలో ఫ్రీగా ఉన్నాడని హోటల్ నిర్వాహకులు వివరించారు. కస్టమర్స్ కు సంబంధించిన బకాయిలు 72 గంటలకు మించి పెండింగ్ లో ఉంటే.. ఆ సమాచారాన్ని CEO, ఫైనాన్షియల్ కంట్రోలర్ దృష్టికి తీసుకు వెళ్లాలని రోసియేట్ హౌస్ హోటల్ నిబంధన చెబుతోంది. అయితే, దత్తాకు సంబంధించిన బకాయిల వివరాలను హోటల్ CEO, FCకి ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్‌మెంట్ హెడ్ ప్రకాష్ పంపలేదు. అంకుష్ దత్తా ఉన్న రూమ్ వివరాలను ఇతర సెటిల్మెంట్ బిల్లులలో కలిపేసి.. వాటిలో ఆ రెంట్ లెక్కను చూపించాడు. ఈ క్రమంలో అంకుష్ దత్తా వేర్వేరు తేదీల్లో రూ. 10 లక్షలు, రూ. 7 లక్షలు, రూ. 20 లక్షల మూడు చెక్కులను హోటల్ కు ఇవ్వగా.. అవన్నీ బౌన్స్ అయినట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఈ విషయాన్ని కూడా హోటల్ యాజమాన్యం దృష్టికి ప్రకాష్ తీసుకెళ్లలేదు. దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News