ఫ్రీ అంటే చాలు జనాలు టక్కున అక్కడ వాలిపోతారు. జనాల ఆసక్తిని క్యాష్ చేసుకునేందుకు పలువురు ఫ్రీ పేరుతో బోల్తా కొట్టిస్తారు. అయితే పంజాబ్ పోలీసులు ఈ ఫ్రీ పథకాన్నే అమలు చేసి 8కోట్లు కొట్టేసిన నిందితులను పట్టుకున్నారు. 8 కోట్లు కొట్టేసి ఫ్రీ ఫ్రూటీకి దొరికిపోవడం విడ్డూరంగా కదూ..
పంజాబ్‌లోని లుథియానాలో రూ.8 కోట్ల 49 లక్షలు చోరీకి పాల్పడిన మాస్టర్‌మైండ్ మన్‌దీప్ కౌర్ ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. చోరీ తర్వాత ఆమె ఉత్తరాఖండ్ చమేలీలో గల హేమకుండ్ సాహిబ్‌కు మొక్కుతీర్చుకునేందుకు భర్తతో పాటు వెళ్లింది. ఈ సమాచారం పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు ఫ్రీ ఫ్రూటీ సర్వీస్ పేరుతో పథకం వేయగా.. ఆమె ఫ్రూటీ తాగేందుకు వచ్చి భర్తతోపాటు పోలీసులకు దొరికిపోయింది.
ఈ ఘటనలొ ఇప్పటికే ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో పోలీసులు 9 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 5 కోట్ల 96 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ‘‘ మన్‌దీప్ కౌర్ దంపతులు నేపాల్ మార్గంలో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే లుక్‌అవుట్ నోటీస్ జారీ చేయడంతో వారు వెళ్లలేకపోయారు. ఉత్తరఖాండ్ లో ప్లాన్ ప్రకారం మన్ దీప్ కౌర్, ఆమె భర్త జస్విందర్ సింగ్ తో పాటు మరో నిందితుడు గౌరవ్ను అరెస్ట్ చేశాం. వారి నుంచి 21లక్షలు స్వాధీనం చేసుకున్నాం’’ అని సీపీ మన్దీప్ సింగ్ సిద్దూ తెలిపారు.
జూన్ 10న రాత్రి వేళ లుథియానాలోని న్యూ రాజ్‌గురు నగర్ ప్రాంతంలో సిఎంఎస్ సెక్యూరిటీస్‌కు చెందిన ఒక క్యాష్ వ్యాన్‌ను దుండగులు చోరీ చేశారు. ఈ వ్యానులో రూ. 8 కోట్ల 49 లక్షలు ఉన్నాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. సైబర్ టీం సహాయంతో ఐదుగురు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి 5కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ చోరీకి మాస్టమైండ్ అయిన మన్ దీప్ కౌర్ ఆమె భర్తతో పాటు అదృశమైంది. దీంతో వారిని పక్కా ప్లాన్ ప్రకారం పోలీసులు అరెస్ట్ చేశారు.