రూ.500 టికెట్‌తో రూ.25 కోట్ల లాటరీ.. అదృష్టం అంటే ఇదే
అదృష్టం ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో చెప్పలేం. ఒక్కొక్కసారి ఊహించని విధంగా లక్ కలిసొస్తూ ఉంటుంది. రూ.500 పెట్టి లాటరీ టికెట్ కొన్న ఓ సామాన్య వ్యక్తి.. ఏకంగా రూ.25 కోట్లు గెలుచుకున్నాడు. ఒక్కసారిగా రూ.25 కోట్లు అతడి సొంతం కావడంతో కోటీశ్వరుడిగా మారాడు. కేరళలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కేరళలో ఓనం సందర్భంగా ప్రతీ ఏడాది అక్కడి ప్రభుత్వం లాటరీలు నిర్వహిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా మూడు బహుమతులు అందిస్తారు. మొదట బహుమతి రూ.25 కోట్లు, రెండో బహుమతి రూ.కోటి, మూడో బహుమతి రూ.50 వేలు ఇస్తూ ఉంటుంది. లాటరీ టికెట్ ధర కేవలం రూ.500 మాత్రమే కాగా.. ఈ సారి ఏకంగా 90 లక్షల టికెట్లు అందుబాటులో ఉంచారు. ఇందులో 75 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి.
కేరళ ప్రభుత్వం..బుధవారం ఈ లాటరీని డ్రా తీయగా.. తమిళనాడులోని కోయంబత్తూర్‌కు చెందిన గోకులం నటరాజ్ అనే వ్యక్తి రూ.25 కోట్లు గెలుచుకున్నాడు. 230662 అనే నెంబర్ గల టికెట్‌ను పాలక్కడ్‌లోని వలయార్ డ్యామ్ సమీపంలోని భవ ఏజెన్సీలో నటరాజ్ కొనుగోలు చేశాడు. లాటరీలో రూ.25 కోట్లు తగలడంతో నటరాజ్ ఎగిరి గంతేస్తున్నాడు. రూ.25 కోట్లలో 30 శాతం ట్యాక్స్ కట్ చేయనుండగా.. రూ.17.5 కోట్లు ఇవ్వనున్నారు. లాటరీలో రూ.కోట్లు గెలుస్తానని తాను అసలు ఊహించలేని, సరదాగా టికెట్ కొనుగోలు చేసినట్లు నటరాజ్ చెబుతున్నాడు. లాటరీలో ప్రథమ బహుమతి గెలుచుకోవంతో తన పంట పడిందని ఫుల్ ఖుషీ అవుతున్నాడు. ఇక ఇదే డ్రాలో మరో 20 మందికి రెండో బహుమతి లభించింది. వీరికి ఒక్కొక్కరికి రూ.కోటి అందించనున్నారు. ఇక మూడో బహుమతి కింద 20 మందికి రూ.50 లక్షలు దక్కనున్నాయి. మరోవైపు.. నాలుగో బహుమతి కింద రూ.5 లక్షల చొప్పున 10 మంది అందుకోనున్నారు
ప్రభుత్వం నిర్వహించే ఈ లాటరీకి ప్రతీ ఏడాది క్రేజ్ పెరుగుతోంది. గత ఏడాది 11 లక్షల టికెట్లు మత్రమే అమ్ముడుపోగా.. ఈ సారి రికార్డు స్థాయిలో 75 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇతర రాష్ట్రాలకు చెందినవారు కూడా పెద్దఎత్తున లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తుండడంతో.. లాటరీలో గెలిచిన వాళ్లు కోటీశ్వరులవుతున్నారు.