జింక మాంసం ప్లేస్లో కుక్క మాంసం.. తిన్నవారి పరిస్థితి ఏంటంటే

Update: 2023-06-10 04:55 GMT

అడవి జంతువులను వేటాడటం నేరం. అది తెలిసినా కొందరు.. గుట్టు చప్పుడు కాకుండా వేటాడి.. వాటి మాంసాన్ని అమ్ముతుంటారు. అడవి జంతువుల మాంసం అమ్మినా, కొన్నా నేరం అని తెలిసినా ప్రజలు.. వాటిని తినడానికి ఎగబడుతుంటారు. వారి ఆశను క్యాష్ చేసుకోవాలనుకున్నారు దుండగులు. దాంతో కుక్క మాంసాన్ని జింక మాంసం పేరుతో అమ్మారు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది.

పొట్టపెళ్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్, చమన్ పల్ల గ్రామానికి చెందిన వరుణ్ ఈ మోసానికి పాల్పడ్డారు. ఈ ఇద్దరు లక్షణచందాలోని ఆనంద్ అనే వ్యక్తి పెంపుడు కుక్కను దొంగిలించారు. తర్వాత వాళ్ల గ్రామానికి తీసుకెళ్లి ఆ కుక్కను చంపారు. గుట్టు చప్పుడు కాకుండా జింక మాంసం పేరుతో ఆ కుక్క మాంసాన్ని చుట్టు పక్కల గ్రామాల్లో అమ్మారు. అటవి ప్రాంతం కావడంతో.. అది నిజంగా జింక మాంసం అని నమ్మిన జనాలు ఎగబడి కొనుకున్నారు. తర్వాత వండుకుని తిన్నారు.

అయితే, తన పెంపుడు కుక్క చోరీకి గురైందని గుర్తించిన ఆనంద్.. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు.. శ్రీనివాస్, వరుణ్ కుక్కను ఎత్తుకెళ్లడాన్ని సీసీటీవీలో చూసి గుర్తించారు. తర్వాత నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. కుక్కను చంపి, జింక మాంసం పేరుతో విక్రయించినట్లు ఒప్పుకున్నారు. దాంతో నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, జింక మాంసం అనుకుని కుక్క మాంసం తిన్న జనాలు భయాందోళనకు గురవుతున్నారు. తమ ఆరోగ్య ఏమవుతుందో అని భయపడుతున్నారు.


Tags:    

Similar News