టామాటాల లారీ బోల్తా.. తెలంగాణ పోలీసుల కాపలా..

Update: 2023-07-15 16:24 GMT

కూరగాయల లారీలు, కోళ్ల లారీలు, ఆయిల్ ట్యాంకర్లు, పాల ట్యాంకర్లు బోల్తాపడడం, చుట్టుపక్కల జనం తండోపతండాలుగా వచ్చి అందినంత సరకు ఎత్తుకుపోవడం మామూలే. అయితే టామాటా విషయంలో అది కుదరనే కదురదు అంటున్నారు తెలంగాణ పోలీసులు. బోల్తా పడిన టమాటాల లారీకి వాళ్లు కళ్లలో వత్తులు వేసుకుని మరీ కాపలా కాస్తున్నారు మరి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి దగ్గర్లోని మావలలో ఈ వింత చోటుచేసుకుంది.

కర్నాటకలోని కోలార్ నుంచి నుంచి దేశ రాజధాని ఢిల్లీకి టామాటాల లోడుతో వెళ్తున్న లారీ శనివారం సాయంత్రం 44వ నంబర్ జాతీయ రహదారిపై మావల వద్ద బోల్తా పడింది. విషయం తెలుసుకున్న స్థానికులు, రోడ్డున పోయేవాళ్లు కొంత సరుకు ఎత్తుకెళ్లారు. లారీలో డ్రైవర్‌తో పాటు, ఖరీదైన సరుకు కావడంతో పళ్ల యజమాని కూడా ఉన్నారు. స్వల్పంగా గాయపడిన యజమాని, బంగారం లాంటి టామాలను జనం ఎత్తుకెళ్తున్నారని పోలీసులకు చెప్పి, సెక్యూరిటీ కోరాడు. దీంతో పోలీసులు, సరుకుని ఇతర వాహనాల్లోకి తరలించేవరకు కాపలా కాస్తున్నారు. లారీలో రూ. 25 లక్షల విలువ చేసే సరుకు ఉందని చెబుతున్నారు. నెల రోజులుగా మండిపోతున్న టామాటా ధరలు ఇప్పట్లో దిగొచ్చేలా కనిపించడం లేదు. శుక్రవారం హరియాణా రిటైల్ మార్కెట్లో మేలిరకం టామాలు కేజీ రూ. 400 పలికాయి. దేశవ్యాప్తంగా సాధారణ రకం పళ్లను రూ. 150 నుంచి 250 మధ్య అమ్ముతున్నారు. వర్షాలకు పంట దెబ్బతినడంతో పళ్లకు కొరతొచ్చి పడింది.


Tags:    

Similar News