సరదా ఇంటి పెరడులో తిరుగుతున్న వ్యక్తికి పూల మొక్కల మధ్యలో ఎదో వింత ఆకారం కనిపించింది. అదేంటో చూద్దామని దగ్గరగా వెళ్లి.. ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ వింత ఆకారం భారీ పుట్టగొడుగుగా గుర్తించి గురయ్యాడు. ఒడిశాకు చెందిన ఆ వ్యక్తి ఇంటి పెరటిలో దాదాపు 8 నుంచి 10 కిలోల మధ్య బరువు ఉన్న పుట్టగొడుగు దొరికిందన్న వార్త ఒక్కసారిగా ఆ ఊరంతా పాకింది.
అసలేం జరిగిందంటే.. సంబల్పుర్ జిల్లాలోని ఖలియాముండా గ్రామానికి చెందిన లూరి కిషన్ తన పెరట్లోకి ఆదివారం ఉదయం వెళ్లాడు. ఆ పెరట్లో రకరకాల చెట్లు, పూల మొక్కలు ఉన్నాయి. అయితే లూరి కిషన్‌కు ఖర్జూర చెట్టు కింద దాదాపు 8 నుంచి 10 కిలోల మధ్య ఉండే పుట్టగొడుగు కనిపించింది. వెంటనే దానిని తీసి ఇంటికి తీసుకెళ్లాడు. ఇంత పెద్ద పుట్టగొడుగును గతంలో ఎప్పుడూ చూడలేదని అన్నాడు లూరి కిషన్. ఇది అరుదైన జాతికి చెందిన మష్రూమ్ అని భావిస్తున్నామని తెలిపాడు. గ్రామస్థులు సైతం ఇంత పెద్ద పుట్టగొడుగును చూసేందుకు తరలివచ్చారు.
కొన్నాళ్ల క్రితం.. కేరళలో దాదాపు 2 కిలోల బరువున్న పుట్టగొడుగులు మొలకెత్తి.. అందరి దృష్టిని ఆకర్షించాయి.ఇడుక్కి జిల్లా, అదిమలైకు చెందిన కవుమ్తాదతిల్ బేబీ పెరట్లో రెండు పుట్టగొడుగులు మొలకెత్తాయి. ఒక్కో పుట్టగొడుగు దాదాపు 2 కిలోల బరువు, రెండున్నర అడుగుల వెడల్పు ఉండడం గమనార్హం. అందుకే, బేబీ పెరట్లో మొలకెత్తిన అరుదైన పుట్టగొడుగులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.