థంబ్స్ అప్ ఎమోజీ పెడుతున్నారా, జాగ్రత్త.. 50 లక్షల ఫైన్ పడింది!

Update: 2023-07-11 12:01 GMT

మనుషులు భాష కనిపెట్టకముందు సైగలతో కమ్యూనికేషన్లు కొనసాగించారు. నేటి రాకెట్ ప్రయోగాల యుగంలోనూ సైగలకు చాలా ప్రాధాన్యముంది. మాటలకు, అక్షరాలకు బదులు అన్నీ సైగలుo. సరే అని చెప్పడానికి థంబ్స్ అప్ గుర్తు, బాధగా ఉందని చెప్పడానికి కన్నీటి బొమ్మ, కోపానికి యాంగ్రీ బొమ్మ, మరింత కోపానికి మిడిల్ ఫింగర్ వంటి నానా బొమ్మలూ వాడుకుంటున్నాం. సోషల్ మీడియాలో బద్దకస్తులకు ఇవి వరప్రసాదమే. అయితే కొన్ని సందర్భాల్లో ఒక ఎమోజీకి బదులు మరో ఎమోజీ పెట్టడం వల్ల అపార్థాలు కూడా చోటుచేసుకుంటూ ఉంటాయి. ఇవన్నీ కామనేగా, ఇందులో పెద్ద విషయం ఏముందని అని అనుకోకండి. వాట్సాప్ చాటింగ్‌లో సరే అని చెప్పడానికి యథాలాపంగా థంబ్స్ అప్ సింబల్ నొక్కిన ఓ వ్యక్తికి కోర్టు రూ. 50 లక్షల భారీ జరిమానా విధించింది. ఎమోజీలకు కూడా చట్టబద్ధత ఉందని, అవి స్పష్టమైన అర్థాన్ని ఇస్తాయని సుద్దులు చెప్పింది.

కెనడా రెండు కంపెనీల మధ్య జరిగిన గొడవ ఇది. ఎక్టర్ ల్యాండ్ అండ్ కేటిల్ కంపెనీ, సౌత్ వెస్ట్ టర్మినల్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు అవిసె గింజల కోసం వాట్సాప్‌లో చాట్ చేశారు. తమకు 86 టన్నుల అవిసె గింజలు కావాలని సౌత్ వెస్ట్ కంపెనీ.. ఏక్టర్ కంపెనీని నడుపుతున్న రైతు క్రిస్ ఏక్టర్‌ను కోరాడు. కేజీ రూ. 1048 లెక్కన అమ్ముతానని ఏక్టర్ చెప్పాడు. డోర్ డెలివరీ కూడా ఉంటుందన్నాడు. డీల్ ఓకే అయిందని చాటింగ్ చివరల్లో థంబ్స్ అప్ ఎమోజీ పెట్టాడు. అయితే అనుకున్న తేదీకి గింజలు డెలివరీ కాలేదు. సౌత్ వెస్ట్ ప్రతినిధి ఆరా తీశాడు. అయితే తను సరుకు డెలవరీ చేస్తానని ఎక్కడా చెప్పలేదని ఏక్టర్ వాదించాడు. మరి ఎమోజీ పెట్టావు కదా, దాని అర్థమేమిటని కొనుగోలుదారు సౌత్ వెస్ట్ ప్రతినిధి అన్నాడు. గొడవ కోర్టుకు చేరింది. సౌత్ వెస్ట్ కంపెనీ.. చాటింగ్ స్క్రీన్ షాట్లను కోర్టుకు సమర్పించింది. ఏక్టర్ చేతిగుర్తు నొక్కాడు నొక్కాడు అని చెప్పింది తప్ప కాంట్రాక్ట్‌ కుదుర్చుకుంటున్నట్టు లీగల్‌గా చెల్లుబాటు అయ్యే ఆధారాలేవీ చూపించలేకపోయింది. సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు సౌత్ వెస్ట్ కంపెనీకే అనుకూలంగా తీర్పు చెప్పింది. థంబ్స్ అప్ ఎమోజీని పెట్టడమంటే ఒప్పందాన్ని ఆమోదించినట్టేనని, డిజిటల్ కమ్యూనికేషన్లలో దీనికి విలువ ఉంది కనక చాటింగ్‌లోనూ ఆమోదానికి గుర్తుగా భావించాలని వ్యాఖ్యానించింది. సమయానికి సరుకు ఇవ్వలేకపోయినందుకు ఏక్టర్‌కు రూ. 50 లక్షల(61,442 డాలర్లు) జరిమానా వడ్డించింది.


Tags:    

Similar News