రాబోయే ఎన్నికల్లో చదువుకున్న వారికి తప్ప.. నిరక్షరాస్యులైన రాజకీయ నాయకులకు ఓటు వేయొద్దని చెప్పినందుకు ఓ ఉపాధ్యాయుడిపై వేటు పడింది. బెంగళూరులోని ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ అన్‌అకాడమీలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కరణ్ సంగ్వాన్.. తరగతి గదిలోని విద్యార్థులకు సమాజంలో వారి పాత్రను తెలియజేసేలా కాస్త తెలివి నేర్పించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. కరణ్ రూల్స్ బ్రేక్ చేశాడని అతడిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ సదరు విద్యాసంస్థ నిర్ణయం తీసుకుంది.
అన్‌అకాడమీలో పనిచేస్తున్న సంగ్వాన్ తరగతి గదిలో పాఠాలు బోధిస్తున్న క్రమంలో.. రాబోయే ఎన్నికల గురించి విద్యార్థులకు పలు సూచనలు చేశాడు. ఇందులో భాగంగా ఎన్నికల్లో 'నిరక్షరాస్యులకు ఓటు వేయొద్దన్నాడు. అంతేకాదు పేర్లు మార్చుకునే రాజకీయ నాయకులకు కూడా ఓటు వేయొద్దని విజ్ణప్తి చేశాడు. ఓటు వేసే ముందు ఆలోచించాలని..అక్షరాస్యత గల వ్యక్తిని ఎన్నుకోవాలని సూచించాడు. నిరక్షరాస్యులకు ఓటేస్తే ఇబ్బందుల్లో పడతారని..కాబట్టి..ఓటు ఎవరికి వేయాలో ముందే నిర్ణయించుకోవాలని చెప్పాడు. 54 సెకన్ల వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
దీనిపై అన్‌అకాడమీ సహవ్యవస్థాపకుడు సైనీ ట్వీట్(ఎక్స్) చేశారు. ‘‘మా సంస్థ నాణ్యమైన విద్యను అందించడానికి కట్టుబడి ఉంది. మా సంస్థలో పనిచేసే ఉపాధ్యాయులకు కఠిన ప్రవర్తనా నియమావళి అమలులో ఉంది. మేము చేసే ప్రతిపనికి విద్యార్థులే మూలం. వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోవడానికి తరగతి గది సరైన వేదిక కాదు. అవి విద్యార్థులను ప్రభావితం చేయగలవు. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు సంగ్వాన్ మాతో విడిపోవాల్సి వచ్చింది’’ అని సైనీ పేర్కొన్నారు.
ఈ విషయంపై దిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ స్పందించారు. చదువుకున్న వారికి ఓటు వేయమని చెప్పడం నేరమా?అన్నారు. ఎవరైనా నిరక్షరాస్యులైతే వారిని నేను వ్యక్తిగతంగా గౌరవిస్తాననీ, కానీ, ప్రజాప్రతినిధులు కచ్చితంగా చదువుకున్నవారై ఉండాలని అన్నారు. శాస్త్రసాంకేతిక రంగాలు ఏలుతున్న కాలంలో చదువుకోని ప్రజాప్రతినిధులు 21వ శతాబ్దపు ఆధునిక భారతదేశాన్ని ఎప్పటికీ నిర్మించలేరని అన్నారు.
కరణ్ యూట్యూబ్ ఛానెల్, లీగల్ పాత్ షాలా వ్యవస్థాపకుడు. ఎల్ఎల్ఎం పూర్తి చేసిన అతనికి.. క్రిమినల్ చట్టాలపై ఇతనికి ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. అంతేకాదు న్యాయవ్యవస్థలో మాస్టర్స్ కూడా చేశాడు. 2020లో అన్‌అకాడమీలో చేరాడు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో నేషనల్ లా యూనివర్సిటీలో చదివాడు.