మెక్‌డొనాల్డ్స్‌కు భారీ ఫైన్ పడింది. ఓ చిన్నారి ఆర్డర్ విషయంలో మెక్ డొనాల్డ్స్ చేసిన పనికి 6 కోట్ల ఫైన్ పడింది. ఒలివియా కారబల్లో అనే నాలుగేళ్ల చిన్నారి 2019లో ఫ్లొరిడాలోని మెక్‌డొనాల్డ్స్ డ్రైవ్ ఇన్‌కు కుటుంబసభ్యులతో కలిసి వెళ్లింది. అక్కడ హ్యాపీ మీల్‌ను కొనుగోలు చేసిన చిన్నారి.. కారులో కూర్చొని తినేందుకు ప్రయత్నించింది. బాక్స్ తెరవగానే బాగా వేడిగా ఉన్న ఓ చికెన్ నగెట్ ఆమె కాలుపై పడింది. దీంతో చిన్నారి కాలుకు స్వల్ప గాయమవడంతో చాలా సేపు ఏడ్చింది.
ఒలివియా కుటుంబ సభ్యులు మెక్‌డొనాల్డ్స్‌పై కేసు ఫైల్ చేశారు. కోర్టుకు చిన్నారి గాయం ఫొటోలు, ఆ సమయంలో పాప బాధతో ఏడుస్తున్న ఆడియోను అందజేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఆ చిన్నారికి గతంలో పడిన ఇబ్బందికి నాలుగు లక్షల డాలర్లు.. భవిష్యత్తు కోసం మరో నాలుగు లక్షల డాలర్లు చెల్లించాలని మెక్‌డొనాల్డ్స్‌ను ఆదేశించింది. ఇండియన్ కరెన్సీలో ఇది రూ.6.5 కోట్లకు సమానం.
పాపకు కాలిన గాయం మూడు వారాల్లో తగ్గిందని మెక్‌డొనాల్డ్స్ తరపు లాయర్ వాదించాడు. ఆమెకు 1.56లక్షల డాలర్లు సరిపోతాయని చెప్పారు. ఆ పాప ఇప్పటికీ మెక్‌డొనాల్డ్స్ ఔట్‌లెట్లకు వెళ్లి చికెన్ నగెట్లను తింటోందని అన్నారు. కానీ కోర్టు మాత్రం 8 లక్షల డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. అయితే కోర్టు నుంచి తాము ఏది ఆశించలేదని పాప తల్లి తెలిపింది.