మేనకోడళ్లను మేనమామలు పెళ్లాడడం మన దేశంలో మామూలే. కొందరికి వింతగా ఉన్న సంబంధాలు మరికొందరికి మామూలుగా కనిపిస్తాయి. కాకపోతే ఎంత ప్రేమ పెళ్లిళ్లు అయినా కాస్త వావీ వరసా చూసుకుని పెళ్లాడుతుంటారు. అయితే ప్రేమ సహజంగానే గుడ్డిది కాబట్టి కొందరు ఏవీ పట్టించుకోకుండా ఒకంటివారవుతుంటారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రియా, శుభమ్ జంట అలాంటిందే. ఇద్దరూ వరసకు కూతురు, బాబాయి అయినా గాఢంగా ప్రేమించుకుని, అందర్నీ ఎదిరించి గుళ్లో పెళ్లి చేసుకున్నారు. వరసకు కూతురైన పిల్లను ఎలా పెళ్లిచేసుకుంటావురా వెధవా అని కుటుంబసభ్యులు చెడామడా తిట్టిపోసినా శుభమ్ వెనక్కి తగ్గలేదు. తండ్రిలాంటి వాడు నీకెలా మొగుడవుతాడే పనికిమాలినదానా అని రియాను కూడా తిట్టినా ఫలితం లేకపోయింది. చేసుకుంటే అతణ్నే చేసుకుంటా, లేకపోతే చచ్చిపోతా అని పట్టుబట్టింది. దీంతో చేసేదేమీ లేక ఇద్దరికీ గుళ్లో ముడిపెట్టారు.
జౌన్‌పూర్ జిల్లా తాజుద్దీన్‌పూర్ గ్రామంలో ఈ చిత్రమైన పెళ్లి చేసింది. శుభమ్ తనకు వరసకు అన్న అయిన వ్యక్తి కూతురు రియాతో మూడేళ్లుగా పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. వీరి ప్రేమను పెద్దలు అడ్డుకున్నారు. ఊరివాళ్లు మరింత విరుచుకుపడ్డారు. వారీ వరసా లేని పెళ్లితో సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. అన్ని ప్రశ్నలకూ ఇద్దరూ ‘‘ప్రేమ’’ అని సమాధానం చెప్పారు. పట్టిన పట్టు వీడకపోవడంతో ఊళ్లోని ఆంజనేయ స్వామి దేవాలయంలో శుభమ్.. రియా నుదట సిందూరం దిద్ది పెళ్లి తంతు ముగించాడు. అయితే ఊరివాళ్లు మాత్రం ఈ పెళ్లిని తాము అంగీకరింబోమని అంటున్నారు. ఊరి నుంచి వెళ్లిపోతామని కొత్త జంట కూడా బెదిరిస్తోంది.