పెళ్లికి వెళ్లాలంటే దీన్ని స్కాన్ చేయాల్సిందే..

Byline :  Krishna
Update: 2023-08-29 06:19 GMT

పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని అనుభూతి. అది జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకోవాలని కొంతమంది అనుకుంటారు. వెరైటీ ఆలోచనలతో తమ పెళ్లిని మరింత అందంగా మలుచుకుంటారు. కొందరు గ్రాండ్ లుక్తో చేసుకుంటే మరికొందరు అదిరే విందుతో ఆహుతుల్ని మైమరిపిస్తారు. తాజాగా ఓ యువకుడు తన పెళ్లికార్డుతో అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాడు. వెరైటీ వెడ్డింగ్ కార్డుతో వారి పెళ్లి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

ఈ యువకుడు పాన్ కార్డు టైపులో వెడ్డింగ్ కార్డు తయారు చేయించాడు. ముందు భాగంలో ఇద్దరి ఫొటోలు, పేర్లు, డేట్ ఉంది. వెనుక భాగంలో క్యూఆర్ కోడ్ను పెట్టారు. పెళ్లి ముహూర్త సమయం, వేదిక, ఇలాంటి వివరాలన్నీ తెలుసుకోవాలంటే కార్డులో ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సిందే. ఏటీఎం కార్డు సైజులా ఉన్న ఈ వెడ్డింగ్ కార్డు ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో వైరల్గా మారింది.

పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామానికి చెందిన కృష్ణా రెడ్డి - శిరీషల పెళ్లి సెప్టెంబర్ 2న జరగనుంది. అందరిలా కాకుండా వీరు వెడ్డింగ్ కార్డును వెరైటీగా రెడీ చేయించాయి. పాన్ కార్డు టైపులో ఉండి.. దానిపై క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేశారు. పెళ్లికి రావాలనుకునేవారు ఈ కోడ్ ను స్కాన్ చేయాల్సిందే. ఎందుకంటే స్కాన్ చేస్తేనే పెళ్లి వేదిక సహా అన్నీ వివరాలు తెలుస్తాయి. బెంగళూరులో ఈ కార్డు తయారుచేయించినట్లు పెళ్లికొడుకు సోదరుడు తెలిపారు. గోదారోళ్ల రూటే సపరేట్ అని మరోసారి రుజువు చేశారు. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ కార్డు నెట్టింట వైరల్గా మారింది.

Tags:    

Similar News