చనిపోయాడు అనుకున్న వ్యక్తి.. 33ఏళ్ల తర్వాత తిరిగొచ్చాడు

Update: 2023-06-02 15:41 GMT

అది రాజస్థాన్ లోని అల్వార్ జిల్లా బన్సూర గ్రామం. ఆ గ్రామంలో ఓ వ్యక్తి 33 ఏళ్ల క్రితం అదృశ్యమయ్యాడు. అప్పడు అతడి వయస్సు 42ఏళ్లు. ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో గతేడాది కుటుంబసభ్యులు డెత్ సర్టిఫికెట్ కూడా తీసుకున్నారు. అయితే ప్రస్తుతం అందరికీ షాక్ ఇస్తూ ఇంటికి చేరుకున్నాడు. 75ఏళ్ల వయస్సులో వచ్చిన అతడిని చూసి కుటుంబసభ్యులు ఆశ్చర్యపోయారు.

రాజస్థాన్‌లోని బన్సూర్ గ్రామానికి చెందిన హనుమాన్ సైనీ అనే వ్యక్తి 1989లో ఢిల్లీలోని ఓ దుకాణంలో పనిలో చేరాడు. అప్పటికి అతని వయసు 42 ఏళ్లు. అయితే అదే ఏడాది అతను ఎవరికి చెప్పకుండా ఢిల్లీ నుంచి హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రాకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న ఓ మాతా మందిరంలో పూజలు చేస్తూ గడిపాడు. దాదాపు 33 ఏళ్ల పాటు ఆ ప్రాంతంలోనే జీవించాడు.

చివరికి 75 ఏళ్ల వయసులో అక్కడి నుంచి తన స్వగ్రామమైన బన్సూర్‌కు వచ్చేశాడు. చాలాకాలం తర్వాత హనుమాన్ సైనీ ఇంటికి రావడంతో కుటుంబసభ్యులు ఆశ్చర్యపోయారు. చాలా ఏళ్ల తర్వాత పెద్దాయన తిరిగిరావడంతో ఆనందపడిపోయారు. ‘‘నాన్న బతికి ఉన్నారనే ఆశ వదులుకున్నాం. అందుకే గతేడాది మరణ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకున్నాం. ఇప్పుడు నాన్న ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. దేవుడికి కృతజ్ఞతలు’’ అని అతడి కుమారులు సంతోషం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News