మెడలోతు నీటిలో న్యూస్ కవరేజ్...రిపోర్టర్ అత్యుత్సాహం..!

Update: 2023-07-15 10:51 GMT

భారీ వర్షాలకు ఉత్తరాది నీటి మునిగింది. భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఢిల్లీ సహా హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్ముకశ్మీర్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కాస్త తగ్గుముఖం పట్టి మళ్లీ పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలవ్వడంతో ప్రజలు బిక్కుబిక్కమంటూ బతుకుతున్నారు. ఇప్పటికే కురిసిన వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థమైంది. అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నదులు ప్రమాదకరంగా ప్రవాహిస్తున్నాయి. భారీ వర్షాలకు రహదారులు కొట్టుకుపోయాయి. పలు గ్రామాలు చెరువులను తలిపిస్తున్నాయి.

నీటి మునిగిన ప్రాంతాల ప్రజల కష్టాలను కొన్ని న్యూస్ ఛానెల్స్ ప్రపంచానికి తెలియజేస్తున్నాయి. ఈ సమయంలో బాధ్యతగా కొందరు ప్రవర్తిస్తుంటే మరికొందరు రిపోర్టర్లు అత్యూత్సాహం ప్రదర్శించి విమర్శల పాలవుతున్నారు. తాజాగా ఢిల్లీలో ఓ లేడి రిపోర్టర్ లైవ్ రిపోర్టింగ్ పేరిట మెడలోతు నీటిలో న్యూస్ కవరేజ్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఎన్.డి.ఆర్.ఎఫ్. సిబ్బంది అందించిన ట్యూబ్ సహాయంతో వరదనీటిలోకి దిగి రిపోర్టింగ్ చేసింది.

రిపోర్టింగ్ సమయంలో ఆ మహిళా జర్నలిస్ట్ ప్రజలకు సాయమందించే ఎన్.డి.ఆర్.ఎఫ్. సిబ్బందిని వాడుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. వారి ట్యూబ్ సాయంతో నీటిలోకి దిగడంతో..కొంతమంది సిబ్బంది ఆ జర్నలిస్ట్‌ను వీడియో తీశారు. అయితే ఈ చర్యపై మండిపడుతు ఒక నెటిజన్.. తన ట్విట్టర్‎లో వీడియో పోస్ట్ చేశాడు. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమెను, ఆ ఛానెల్‌ను తిట్టిపారేస్తున్నారు. పబ్లిసిటీ కోసం నీటిలో దిగడం తప్ప ఎవరికీ ఉపయోగం లేదని కామెంట్స్ రూపంలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News