తెలంగాణ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఫిబ్రవరి 25, 26 తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ తో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు ఐఎండీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పరిధిలో రేపటి వరకు వానలు పడే ఛాన్స్ ఉంది. ఇప్పటికే రాజన్న సిరిసిల్ల వేములవాడలో వర్షం కురుస్తోంది. కాగా నిన్న కరీంనగర్, సిద్దిపేట, నల్గొండ, మేడ్చల్ జిల్లాల్లో ఓ మోస్తారుగా వర్షం కురిసింది. ములుగు జిల్లా మంగపేటలో 1.3 సెంటీ. మీ వర్షపాతం నమోదు అయ్యింది. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.