బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండ్రోజుల పాటు వర్షాలు

తెలంగాణకు రెయిన్ అలర్ట్

By :  Lenin
Update: 2023-11-05 02:35 GMT


తెలంగాణకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది. తమిళనాడుకి దగ్గర్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడిందని.. దీని కారణంగా తమిళనాడు, కేరళ, కర్ణాటతో పాటు తెలుగు రాష్ట్రాలపైనా ఉంటుందని హెచ్చరించింది. ఇవాళ దక్షిణ తెలంగాణ, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణ విషయానికొస్తే.. నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పారు. నేడు హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పారు. గత రెండు రోజుల నుంచి రాష్ట్రంలో విభిన్న వాతావరణం కనిపిస్తోంది. తెలంగాణలో రాత్రివేళ కనిష్ఠంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా.. పగలు కొన్ని చోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల 36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నేడు ఉత్తర తెలంగాణలో కొంత వేడి, ఉక్కపోత ఉంటుందని చెప్పారు.

ఇక ఏపీలో సైతం కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికిపాటి వర్షాలు కురుస్తున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ విభాగం వెల్లడించింది. ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమ గోదావరి, వైఎస్ఆర్, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.


Tags:    

Similar News