రాష్ట్రంలో కుండపోతగా కురుస్తున్న వర్షం.. ఆరెంజ్ అలర్ట్ జారీ

హైదరాబాద్‌లో ఎడతెరిపిలేని వర్షం.. రోడ్లు జలమయం;

By :  Lenin
Update: 2023-09-05 01:37 GMT


తెలంగాణ వ్యాప్తంగా జోరు వాన కురుస్తోంది. ఉపరితల ఆవర్తనంతో ఆదివారం మొదలైన వర్షం తెరిపినివ్వకుండా పడుతూనే ఉంది. మంగళవారం ఉదయం నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో వాగులు పొంగి, మరి కొన్ని చోట్ల రోడ్లు తెగి రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల పొలాలు నీట మునిగాయి. ఈరోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే భూపాలపల్లి, మహబూబాబాద్‌, జనగామ, హనుమకొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, జగిత్యాల, ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఈ జిల్లాల్లో మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయంటూ ఎల్లో అలర్ట్‌ ఇచ్చింది. అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.




 


హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజామున 4 గంటల నుంచి భారీ వర్షం కురుస్తున్నది. పలు ప్రాంతాల్లో  రోడ్లు జలమయమయ్యాయి. మియాపూర్, నిజాంపేట, లింగంపల్లి, చందనగర్, జేఎన్టీయూ, కూకట్ పల్లి, కేపీహెచ్బీ, బాలనగర్, మూసాపేట, భరత్ నగర్, బొరబండ, మోతినగర్, రహమత్ నగర్, యూసఫ్ గూడ, జూబ్లీ చెక్ పోస్ట్, జూబ్లీ హిల్స్, ఎస్సార్ నగర్, అమీర్ పేట, మదాపూర్, హైటెక్ సిటీ, బంజారాహిల్స్, మెహదీపట్నం, మసబ్ ట్యాంక్, లక్డికపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్, ముషీరాబాద్, క్రాస్ రోడు, చిక్కడ్ పల్లి, నారాయణ గూడ, అంబర్ పేట, తర్నాక, ఉప్పల్, రామంతాపూర్, నాగోల్, ఎల్బీనగర్ లో వర్షం కురుస్తోంది.




 


ఆదివారం ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం సోమవారం వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై.. సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తులో కొనసాగుతూ ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ ఆవర్తనం నుంచి తెలంగాణ వరకు, ఉత్తరాంధ్ర తీరం మీదుగా సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది.


Tags:    

Similar News