Harish Rao : ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్‌లో అన్నీ అబద్దాలే : హరీశ్‌రావు
సాగునీటిపై రేవంత్ రెడ్డి సర్కారు ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై వాడీ వేడీ చర్చ జరిగింది. ఉత్తమ్ ప్రజెంటేషన్ పై మాజీ మంత్రి హరీశ్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. అందులో నాలుగు సత్యదూరమైన విషయాలు ఉన్నాయని అన్నారు. ఉత్తమ్ సభను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వంపై బురద జల్లాలనే ప్రయత్నం తప్ప అందులో ఎలాంటి వాస్తవాలు లేవని హరీశ్ చెప్పారు.
మిడ్ మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయని ఉత్తమ్ పచ్చి అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రూ.775 కోట్లు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టులు పూర్తి చేశామని స్పష్టం చేశారు.
ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం, ఆయకట్టు విషయంలో శ్వేతపత్రంలో రెండు చోట్ల రెండు రకాలుగా చెప్పారని హరీశ్ విమర్శించారు. ప్రాజెక్టులకు అవసరమైనదానికన్నా ఎక్కువ ఖర్చుపెట్టామని అంటున్నారని మండిపడ్డారు. అబద్దాన్ని పదేపదే ప్రచారం చేస్తే అది నిజమైపోతుందని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందని, అందుకే గోబెల్స్ ప్రచారం చేస్తోందని ఆరోపించారు.
కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని 16, 17వ బోర్డు సమావేశంలో తీవ్రంగా వ్యతిరేకించిన విషయాన్ని హరీశ్ గుర్తు చేశారు. కృష్ణా జలాల్లో 50శాతం వాటాను ప్రతిపాదించింది కాంగ్రెస్సేనన్న హరీశ్ రావు.. ఆ పార్టీ అధికారంలోకి వచ్చాకే కేఆర్ఎంబీకు ప్రాజెక్టులు అప్పగిస్తామని అంగీకరించిందని మీటింగ్ మినిట్స్ లో స్పష్టంగా ఉందని చెప్పారు.
రాయలసీమ ఎత్తిపోతలకు బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించిందన్న ఆరోపణలను హరీశ్ ఖండించారు. రాయలసీమ లిఫ్ట్ కు సంబంధించి 2020 మే 5న జీఓ వచ్చిందని, అంతకు ముందు 2020 జనవరి 29నే తాము కేంద్రానికి ఫిర్యాదు చేశామని స్పష్టం చేశారు. మే 5న జీవో వస్తే మే 12న కేంద్రం, కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేసిన విషయాన్ని హరీశ్‌రావు గుర్తు చేశారు.