TSPSC ప్రశ్నపత్రాల లీకేజీ నిందితులు కూడా ఈ రోజు గ్రూప్- 1 ప్రిలిమ్స్ పరీక్ష రాయనున్నారు. వారిని పరీక్షలు రాసేందుకు.. తెలంగాణ హైకోర్టు అనుమతి ఇవ్వడంపై టీఎస్‌పీఎస్సీ అప్పీలు దాఖలు చేసింది. నలుగురు నిందితులను పరీక్షకు అనుమతించాలంటూ శుక్రవారం సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులును కొట్టివేయాలని కోరుతూ కమిషన్ అధికారులు హౌజ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై శనివారం న్యాయమూర్తి ఇంట్లో జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి, జస్టిస్ ఎన్ రాజేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పరీక్షకు అనుమతించి.. ఫలితాలు ప్రకటించవద్దన్న సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. నిందితులు షమీమ్, సురేష్, రమేష్, సాయి సుష్మితలకు హాల్‌టికెట్లు ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశిస్తూ అప్పీలును కొట్టివేసింది.
ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి ఒంటి గంట వరకు ఈ పరీక్ష(తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష) జరగనుంది. అక్టోబర్ 16 నాటి పరీక్ష కోసం డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్లు ఇప్పుడు పనిచేయవని.. తాజాగా మళ్లీ తీసుకోవాలని కమిషన్ సూచించింది. రాష్ట్రంలో 503 గ్రూప్-1 సర్వీసుల ఉద్యోగాలకు గత ఏడాది ఏప్రిల్‌లో కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.