గ్రూప్‌-2 వాయిదా వేయాల్సిందే.. హైదరాబాద్ టీఎస్‌పీఎస్‌సీ వద్ద ఉద్రిక్తత..

Update: 2023-08-10 08:04 GMT

గ్రూప్‌-2 పరీక్షలను (Group 2 Exams) వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కార్యాలయం ముట్టడికి అభ్యర్థులు యత్నించారు. నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయం నుంచి సుమారు 2 వేల మంది అభ్యర్థులు పెద్దఎత్తున ర్యాలీగా బయలుదేరి వచ్చారు. అభ్యర్థుల నినాదాలతో టీఎస్‌పీఎస్సీ కార్యాలయ పరిసర ప్రాంతాలు మార్మోగాయి. తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరామ్‌, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్.. గ్రూప్‌-2 అభ్యర్థుల నిరసనకు మద్దతు తెలిపారు. ర్యాలీగా వస్తున్న అభ్యర్థుల్లో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అభ్యర్థుల నిరసన నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ కార్యాలయ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. కమిషన్ కార్యాలయం సమీపంలో అభ్యర్థులు బైఠాయించి ధర్నా చేపట్టారు.




 


గ్రూప్ -2 పరీక్షకు ఆగస్టు 29, 30 తేదీలను ఖరారు చేశారని.. కానీ ఆగస్టు 1 నుంచి 23 వరకు గురుకుల బోర్డుకు సంబంధించిన పరీక్ష తేదీలు ఉన్నాయని అభ్యర్థులు తెలిపారు. ఒకే నెలలో గ్రూప్ - 2, గురుకుల పరీక్షల నిర్వహణ, సిలబస్‌లూ వేర్వేరుగా ఉండటంతో.. ఏదో ఒక పరీక్షకు మాత్రమే సన్నద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారణంతో తమకు అర్హతలు ఉన్నప్పటికీ అవకాశాన్ని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టు 2 నుంచి 21 వరకు గురుకుల పరీక్షలు ఉన్నాయి. సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 వరకు జేఎల్ పరీక్షలు ఉన్నాయి. టీఎస్పీఎస్సీ అధికారులు ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తున్నారు. 10 రోజుల వ్యవధిలో చాలా పరీక్షలు ఉన్నాయంటున్నారు. గురుకుల, జూనియర్ లెక్చరర్ పరీక్షలతో ఇబ్బంది ఉందని చెబుతున్నారు. అంతేకాకుండా గ్రూప్ - 2 పరీక్షలోని మూడో పేపర్ (ఎకానమీ)లో గతంలోని సిలబస్‌కు అదనంగా 70 శాతం కలిపారని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ ఘటనతో మూడు నెలలు మానసిక ఆవేదనతో సరిగా చదవలేకపోయామన్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని గ్రూప్ - 2 పరీక్షను మూడు నెలలు వాయిదా వేయాలని కోరారు. మానవతా దృక్పథంతో తమ సమస్యను అర్థం చేసుకుని.. వెసులుబాటు కల్పించాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.




 





 




Tags:    

Similar News