NEET రద్దు చేస్తాం..దయచేసి ఆ పని చేయకండి : స్టాలిన్

Update: 2023-08-14 14:24 GMT

తమిళనాడులో దారుణం జరిగింది. డాక్టర్ కావాలనే ఓ 19 ఏళ్ల యువకుడి కలలు ఆవిరయ్యాయి. నీట్‌ పరీక్షలో క్వాలిఫై కాలేదనే మనస్థాపంతో విద్యార్థి జగదీశ్వరన్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కన్న కొడుకు ఇక లేడనే బాధను తట్టుకోలేక తండ్రి సెల్వశేఖర్‌ సైతం బలవన్మరణానికి పాల్పడ్డారు. తండ్రీ కొడుకులు ఇద్దరూ ఇలా మరణించడంతో ముఖ్యంత్రి స్టాలిన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.




 


ఇవే చివరి నీట్‌ మరణాలు కావాలని ఆయన కోరారు.ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని నీట్‌ విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.

నీట్‌ని రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును పెడ్డింగ్‎లో పెట్టి ఆలస్యం చేస్తున్న రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిపైన పనిలో పనిగా ఈయన విమర్శలు గుప్పించారు. తమిళనాడులో నీట్‌ పరీక్ష కారణంగా విద్యార్థులు చనిపోతున్న విషయం తెలిసిందే.

" నీట్ పరీక్షలను ఎట్టిపరిస్థితుల్లోనూ రద్దు చేస్తాం. విద్యార్థులు ఎవరూ ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దు. నీట్ రద్దుకు సంబంధించి ప్రభుత్వం న్యాయపరమైన మార్గం ద్వారా ప్రయత్నాలు చేస్తోంది. నీట్‌ రద్దుకు అసెంబ్లీలో బిల్లును తీసుకువచ్చినా.. గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి మాత్రం దానిని ఆమోదించడం లేదు. నీట్ జరగాల్సిందేనని అంటున్నారు. నీట్‌ హద్దులు రానున్న కొన్నినెలల్లో బద్దలై తీరతాయి. ఎవరైతే సంతకం పెట్టను అని అంటున్నారో.. రాజకీయ మార్పులు జరిగితే వారు ఎలాగూ కనిపించకుండా పోతారు." అని స్టాలిన్ తెలిపారు.




 


నీట్‌ వ్యతిరేక బిల్లు విషయంలో గవర్నర్‌ ఆలస్యం చేస్తుండటంతో తమిళనాడు ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‎గా తీసుకుంది. దీంతో ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున గవర్నర్‌ ఇచ్చే తేనీటి విందును బహిష్కరిస్తున్నట్లు ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. మరోవైపు బాధిత కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు రాష్ట్ర మంత్రి ఉదయ్‌నిధి స్టాలిన్‌ పరామర్శించారు.





Tags:    

Similar News