Ayodhya Agarbatti: అయోధ్య రాముడి పాదాల చెంత.. 108 అడుగుల భారీ అగర్బత్తి

Update: 2024-01-16 08:11 GMT

అయోధ్యా ఆలయంలో శ్రీరాముని ప్రాణప్రతిష్టకు ఇంకా వారంరోజులే మిగిలుంది. ఇప్పటికే ప్రముఖులందరికీ ఆహ్వానం అందింది. ఇవాళ్టి నుంచి సంప్రదాయ క్రతువులు ప్రారంభం అయ్యాయి. మందిరంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మందిరంలో ప్రతిష్టిచేందుకు కర్నాటక మైసూరుకు చెందిన శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌ రూపొందించిన ప్రతిమను ఎంపిక చేశారు. 150-200 కిలోల బరువుతో ఐదేళ్ల వయసున్న బాల రాముడి రూపంలో ఉన్న ఆ విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించనున్నారు. ఇప్పటికే రామ భక్తులు తమ కానుకలను రాముడికి సమర్పించారు. ఈ క్రమంలో మరో అపూర్వ కానుక రామయ్య పాదాల చెంతకు చేరింది. 108 అడుగుల పొడవు, 3.5 అడుగుల వెడల్పున్న భారీ అగర్ బత్తీని వెలిగించారు. రాముడికి తమ గ్రామం నుంచి ఏదైనా కానుక ఇవ్వాలని భావించిన గుజరాత్ లోని తర్సాలీ గ్రామస్తులు ఈ అగర్ బత్తీని తయారుచేశారు. ఈ భారీ అగర్ బత్తీ ద్వారా రాముడికి రోజూ ధూపం వేసే పని తప్పుతుందని ఈ పనికి పూనుకున్న విహాభాయ్ అనే రైతు తెలిపాడు.

ఈ అగర్ బత్తీని 191 కిలోల నెయ్యి, 376 కిలోల గుగ్గిలం, 280 కిలోల నువ్వులు, 376 కిలోల కొప్పా పౌడర్, 425 కిలోల హవాన్, 1475 కిలోల ఆవుపేడ వాడి తయారుచేసినట్లు చెప్పారు. దీని బరువు మొత్తం 3,400 కిలోలు ఉంటుంది. గ్రామస్థులంతా కలిసి ఈ అగర్ బత్తీ తయారీలో పాలుపంచుకున్నారు. కాగా ఇప్పటికే అయోధ్య చేరిన ఈ అగర్ బత్తిని శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్‌దాస్ జీ మహారాజ్ అధ్వర్యంలో ముట్టిచ్చారు.







Tags:    

Similar News