BJP in Delhi : అన్నాడీఎంకేకు షాక్.. బీజేపీ గూటికి చేరిన 15 మంది మాజీ ఎమ్మెల్యేలు
లోక్సభ ఎన్నికలకు ముందు అన్నాడీఎంకేకు పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీకి గుడ్ బై చెప్పారు. తమిళనాడు బీజేపీ చీఫ్ కె. అన్నామలై సమక్షంలో మొత్తం 15 మంది బీజేపీ కండువా కప్పుకోగా.. అందులో మెజార్టీ నాయకులు అన్నాడీఎంకేకుచెందిన వారే కావడం విశేషం. బీజేపీ తీర్థం పుచ్చుకున్న వారిలో అన్నాడీఎంకేకు గతంలో గుడ్ బై చెప్పిన కె.వడివేలు, ఎంవీ రత్నం, ఆర్. చిన్నస్వామి, పీఎస్ కందస్వామి కూడా ఉన్నారు.
తమిళనాడులో గతంలో బీజేపీ, అన్నాడీఎంకే మిత్రపక్షాలుగా ఉన్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అన్నాడీఎంకే నాయకుల చేరిక సందర్భంగా మాట్లాడిన అన్నామలై ప్రధాని మోడీ నాయకత్వానికి మరింత బలం చేకూర్చేందుకే వారంతా ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. కేంద్రంలో మోడీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. ఈసారి ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకేకు మట్టి కరిపించి బీజేపీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుందని అన్నారు.
తమిళనాడులో ఇంత భారీ స్థాయిలో నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకోవడం మోడీ పాపులారిటీకి నిదర్శనమని అన్నారు. గతంలో రాష్ట్రంలో బీజేపీకి అంత బలం లేదని కానీ ఈసారి పరిస్థితి అలా ఉండదని అన్నారు. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 370 స్థానాలు, ఎన్డీఏకు 400 సీట్లలో విజయం సాధించడం ఖాయమని మోడీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీకి పెరిగే సీట్లలో మెజార్టీ స్థానాలు తమిళనాడులోనే గెలుస్తుందని చెప్పారు.