2024 పార్లమెంట్ ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించనున్నాయి. కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా కలసికట్టుగా పనిచేయాలని 15 ప్రధాన విపక్షాలు నిర్ణయించారు. దేశం నలుగు దిక్కుల్లోని ఈ పార్టీలు ఉమ్మడి ఎజెండాతో ఏకతాటిపైకి రావడం జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం. భిన్నాభిప్రాయాలను పక్కనపెట్టి దేశం ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను పరిష్కరించేందుకు, బీజేపీ మతతత్వ ఎజెండాను ఓడించేందుకు కార్యాచారణ కోసం విపక్షాలు కసరత్తు చేస్తున్నాయి.
కాంగ్రెస్‌తోనే సాధ్యం..
శుక్రవారం బిహార్ రాజధాని పట్నాలో విపక్షాలు సమావేశమై ఉమ్మడి కార్యాచరణపై విస్తృత చర్చలు జరిపాయి. తర్వాత సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్ భేటీ వివరాలు వెల్లడించారు. ‘‘వచ్చే ఎన్నికల్లో కలసికట్టుగా పోరాడేందుకు అన్ని పార్టీల నేతలు అంగీకరించారు. చర్చలు సుహృద్భావ వాతావరణంలో సాగాయి. త్వరలో సిమ్లాలో జరిగే మరో సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం’’ అని ఆయన చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, ‘‘కాంగ్రెస్ లేకుండా బీజేపీనీ ఎదుర్కోవడం కష్టం. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని పట్టువిడుపులతో ఏకాభిప్రాయానికి రావాలి’’ అని అన్నారు. సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, డీఎంకే నేత స్టాలిన్, తృణమూల్ నేత మమతా బెనర్జీ, లాలూ ప్రసాద్ యాదవ్, తదితర అతిరథ మహారథులు ఉన్నారు. ఏకమైన పార్టీల్లో కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ, ఆప్, తృణమూల్, ఆర్జేడీ, శివసేన(ఉద్ధవ్ ఠాకరే), సమాజ్ వాదీ, జేఎంఎం, జేడీయూ, పీడీపీ, ఎన్సీ తదితరాలు ఉన్నాయి..
అదొక ఫోటో సెషన్.. అమిత్ షా
విపక్షాల భేటీపై బీజేపీ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘అదొక ఫోటో సెషన్. మమ్మల్ని గద్దె దించడం మీ సాధ్యం కాదు. 2024లో మళ్లీ బీజేపీనే గెలుస్తుంది. ఈసారి 300కు పైగా సీట్లతో మోదీ మళ్లీ ప్రధాని అవుతారు’’ అని జమ్మూలో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. తమ ప్రభుత్వ హయాంలలో అవినీతే లేదని, యూపీఏ హయాంలో రూ.12 లక్షల కోట్ల అవినీతిలో జరిగిందన్నారు.