రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టిక్కెట్లపై 25శాతం డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించింది. అనుభూతి, విస్టాడోమ్ కోచ్‌లతో సహా ఏసీ సిట్టింగ్ వసతి ఉన్న అన్ని రైళ్లలో ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లలో ఈ తగ్గింపు వర్తించనుంది. ఈ తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఆక్యుపెన్సీ పెంచే లక్ష్యంతో రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
గత 30 రోజుల్లో 50శాతం ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లను పరిగణలోకి తీసుకుంటామని రైల్వే శాఖ తెలిపింది. టికెట్ ధరలను నిర్ణయించే అధికారం ఆయా రైల్వే జోన్లలో ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌కు కట్టబెట్టింది. కాగా దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లు విరివిగా అందుబాటులోకి వస్తున్నాయి. కొన్ని రూట్లలో ఆదరణ బాగానే ఉన్నప్పటికీ.. మరికొన్ని రూట్లలో మాత్రం టికెట్ ధరలు అధికంగా ఉన్న కారణంగా ఆక్యుపెన్సీ తక్కువగా ఉంటోంది.
మరోవైపు ఎండలు తగ్గి వర్షాలు పడుతుండడంతో ఏసీ కోచ్లలో ప్రయాణికుల తగ్గే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే రైల్వే శాఖ ఈ తగ్గింపు స్కీంను తీసుకొచ్చింది. అయితే ఇప్పటికే బుక్ చేసుకున్న వారికి ఇది వర్తించదని రైల్వే శాఖ తెలిపింది. అంతేకాకుండా హాలిడే, ఫెస్టివల్ స్పెషల్ రైళ్లకు ఈ స్కీమ్ వర్తించదని స్పష్టంచేసింది.