సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అధికార బీజేపీతో పాటు ప్రతిపక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇందులో భాగంగా బెంగళూరులో విపక్షాల భేటీ జరుగుతుండగా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం బల ప్రదర్శనకు సిద్ధమైంది. మంగళవారం ఢిల్లీలో ఎన్డీయే కూటమి నేతలతో భేటీ కానుంది. ఈ సమావేశానికి 38 పార్టీలు హాజరు కానున్నాయని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ఎన్డీయే పరిధి క్రమంగా పెరుగుతోందన్న ఆయన.. ప్రధాని మోడీ ప్రభుత్వ పథకాలు, విధానాలు ప్రజలపై సానుకూల ప్రభావం చూపుతోందని అన్నారు.
ఎన్డీయే సమావేశానికి ఇప్పటికే ఉన్న మిత్ర పక్షాలతో పాటు కొత్తగా కూటమిలో చేరిన పార్టీలు సైతం హాజరుకానున్నాయి. ఎన్సీపీ చీలిక వర్గం నేతలు సైతం ఈ మీటింగ్ కు హాజరు కానున్నారు. అజిత్ పవార్‌తో కలిసి ఎన్డీయే భేటీకి వెళ్లనున్నట్లు ప్రఫుట్ పటేల్ స్పష్టం చేశారు. మరోవైపు బీహార్ కు చెందిన మాజీ కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌కు కూడా ఎన్డీయే సమావేశానికి ఆహ్వానం అందింది.