ఢిల్లీలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. నడిరోడ్డుపై కారును అడ్డగించి.. తుపాకీతో బెదిరించి రెండు లక్షలు ఎత్తుకెళ్లారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ చోరీని తీవ్రంగా ఖండించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఎల్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఓ వ్యక్తి రూ. 2 లక్షల నగదుతో కూడిన బ్యాగును గురుగ్రామ్‌లో ఇతరులకు అప్పగించేందుకు క్యాబ్‌లో వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ప్రగతి మైదాన్ టన్నెల్ లోపలికి ప్రవేశించగానే.. రెండు బైకులపై వచ్చిన నలుగురు దుండగులు నడి రోడ్డుపైనే కారును అడ్డుకున్నారు. ఆపై తుపాకీతో బెదిరించి.. కారు వెనుక సీటులో ఉన్న నగదు బ్యాగుతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.
ఈ వీడియోను సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శాంతిభద్రతలను పరిరక్షించడం కేంద్రానికి చేతకాకపోతే ఆ బాధ్యతను ఢిల్లీ సర్కారుకు అప్పగించాలన్నారు. అయితే 1.5 కి.మీల పొడవైన ఈ టన్నెల్‌లో దాదాపు 16 మంది భద్రతా సిబ్బంది కాపలాగా ఉన్నారని, ఘటనా సమయంలో ఎంట్రీల వద్ద వారు విధుల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
LG shud resign. Make way for someone who can provide safety n security to the people of Delhi.
— Arvind Kejriwal (@ArvindKejriwal) June 26, 2023
If Central govt is unable to make Delhi safe, hand it over to us. We will show u how to make a city safe for its citizens. https://t.co/oPtqnAWlgJ