భీకరమైన ఒడిశా రైలు ప్రమాదంలో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 278 మంది ప్రయాణికులు దారుణంగా చనిపోయారు. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం వీరిలో దాదాపు 40 మంది ప్రయాణికులు మాత్రం కరెంట్ షాక్‌తోనే చనిపోయినట్లు తెలుస్తోంది. వారి శరీరాలపై ఎలాంటి గాయాలైన ఆనవాళ్లు లేకపోవడంతో వారు విద్యుత్ షాక్‌తోనే మరణించినట్లు భావిస్తున్నామని రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షించిన ఓ పోలీసు అధికారి తెలిపారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ రైల్వే పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. ప్రమాద సమయంలో లైవ్ ఓవర్‌హెడ్ కేబుల్ తెగి బోగీలపై పడి విద్యుత్ షాక్ జరిగిందని రైల్వే పోలీసులు చెబుతున్నారు.
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఓ గూడ్స్ రైలును ఢీకొట్టిడంతో రైలు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో కొన్ని రైలు బోగీలు పక్కనున్న ట్రాక్‌పై పడిపోయాయి. అదే సమయంలో అటుగా వచ్చిన బెంగళూరు-హావ్‌డా ఎక్స్‌ప్రెస్ కూడా రైలు పట్టాలు తప్పి కోరమాండల్ బోగీలను బలంగా ఢీకొట్టింది. భీకరమైన ఈ ప్రమాద ఘటనతో ఓవర్‌హెడ్ లోటెన్షన్ లైన్ విద్యుత్ తీగలు తెగి బోగీలపై పడ్డాయి. ఈ ప్రమాదంలో బోగీల మధ్య పడి చాలా మంది శరీరాలు నలిగిపోయాయి. ఎన్నో మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో కనిపించాయి. అయితే ఈ ప్రమాదంలో చనిపోయిన 40 మృతదేహాలపై ఎలాంటి గాయాలు కనిపించలేదు. దీంతో విద్యుత్ షాక్ వల్లే వారు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రమాదంపై ఒడిశా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దుర్ఘటన వెనుక కుట్ర కోణం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో తాజాగా సీబీఐ కూడా రంగంలోకి దిగింది. దర్యాప్తును ప్రారంభించింది.