దేశంలో 88వేల కోట్ల విలువైన 500 నోట్లు మిస్సయ్యాయి. ఆ నోట్లు ప్రింట్ అయిన తర్వాత ఆర్బీఐకి చేరలేదని తెలుస్తోంది. సామాజిక కార్యకర్త మనోరంజన్ రాయ్ ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేయడంతో ఈ విషయం బయటపడింది. పాతనోట్లను రద్దు చేసి.. కొత్త రూ.500 నోట్లను తీసుకొచ్చిన సమయంలో దేశంలోని 3 నోట్ల ప్రింటింగ్ కేంద్రాల్లో 8,810.65 మిలియన్ల 500 నోట్లను ముద్రించారు. కానీ అందులో కేవలం 7,260 మిలియన్ల నోట్లు మాత్రమే ఆర్‌బీఐకి చేరినట్లు ఆర్‌టీఐ నివేదిక తెలిపింది. మిగతా 1,760.65 మిలియన్ల నోట్లకు సంబంధించి ఎలాంటి సమాచారం ఆర్‌బీఐ దగ్గర లేనట్లు సమాచారం.
మూడు చోట్ల ప్రింటింగ్..
భారత్‌లో మూడుచోట్ల కరెన్సీ నోట్లను ముద్రిస్తారు. బెంగళూరులోని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ లిమిటెడ్, నాసిక్‌లోని కరెన్సీ నోట్ ప్రెస్, మధ్యప్రదేశ్ దేవస్‌లోని బ్యాంక్ నోట్ ప్రెస్‌లో దేశానికి అవసరమైన కరెన్సీ నోట్లను ముద్రిస్తారు. 2016-17లో నాసిక్ మింట్ 1,662 మిలియన్ల 500 నోట్లను ముద్రించగా.. బెంగళూరు మింట్ 5,195.65 మిలియన్ల నోట్లు, దేవస్‌లో 1,953 మిలియన్ల నోట్లను ముద్రించారు. అయితే, ఆర్‌బీఐ మాత్రం కేవలం 7260 మిలియన్ల నోట్లే అందినట్లు తెలిపింది.
రద్దు కంటే ముందే..
కనిపించకుండా పోయిన మొత్తం 1760.65 మిలియన్ల నోట్లలో 210 మిలియన్ల నోట్లు ఏప్రిల్ 2015 నుంచి మార్చి 2016 మధ్య కాలంలో నాసిక్ మింట్లో ముద్రించినట్లు తేలింది. అయితే, నవంబరు 2016లో కేంద్రం నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాతే కొత్త నోట్లను తీసుకొచ్చారు. కానీ ఆర్‌టీఐ వివరాల ప్రకారం..2015లోనే ముద్రణాలయాల్లో కొత్త నోట్లను ముద్రించినట్లు తెలుస్తోంది.
కరెన్సీ నోట్ ప్రెస్‌లలో ప్రింట్ అయిన నోట్లు, ఆర్బీఐకి చేరిన నోట్లకు మధ్య వ్యత్యాసంపై విచారణ చేపట్టాలని సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లకు మనోరంజన్ రాయ్ లేఖలు కూడా రాశారు. మరోవైపు గతంతో పోలిస్తే 2022-23 ఆర్థిక సంవత్సరంలో గుర్తించిన రూ.500 నకిలీ నోట్ల సంఖ్య 14.4శాతం మేర పెరిగినట్లు ఇటీవల విడుదల చేసిన వార్షిక నివేదికలో ఆర్‌బీఐ వెల్లడించింది.