నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బారా జిల్లాలోని జీత్పూర్ సిమారా లోని చురియామై దేవాలయం సమీపంలో ఓ బస్సు లోయలో పడిపోవడంతో ఆరుగురు మృతి చెందారు. గురువారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హేటౌడాలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో దాదాపు 25 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని బస్సు డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
నేపాల్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ కు చెందిన పలువురు నేపాల్ లో తీర్థయాత్రలకు వచ్చారు. మిగతా యాత్రికులతో కలిసి గురువారం ఉదయం బస్సులో ఖాట్మాండు నుంచి జానక్ పూర్ బయలుదేరారు. జీత్‌పూర్ సిమారాలోని చురియమై ఆలయం సమీపంలో బస్సు అదుపుతప్పింది. దీంతో రోడ్డు పక్కనే ఉన్న 15 మీటర్ల లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 26 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా, ప్రమాదం తర్వాత ప్రాణాలతో బయటపడ్డ బస్సు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.