త్రిపురలో విషాదకరమైన సంఘటన జరిగింది. జగన్నాథుని రథయాత్రలో రథానికి విద్యుత్ హైటెన్షన్ వైరు తగలడంతో ఇద్దరు చిన్నారులు, ముగ్గురు మహిళలు సహా ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో మారో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగానే ఉంది.
ఉనాకోటి జిల్లాలోని కుమార్ఘాట్లో ఉల్టా రథ యాత్ర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ రథయాత్ర జరిగింది. వేలాది మంది భక్తులు ఈ వేడుకలో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా బుధవారం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ఇస్కాన్ టెంపుల్ నుంచి రథం బయలుదేరింది. ఆ సమయంలోనే కరెంటు తీగలు రథానికి తగిలాయి, దీంతో రథాన్ని లాగుతున్న భక్తుల్లో 7 మంది అక్కడికక్కడే మరణించడంతో ఈ సంఘటన సంచలనంగా మారింది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలోనూ కొంత మంది పరిస్థతి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో బాధితుల ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి.
ఈ విషాద ఘటనపై త్రిపుర సీఎం మాణిక్ షా సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేయడంతో పాటు వారికి రూ.2 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. అదే విధంగా పోలీసులు ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యేక విచారణ బృందం ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తోంది.