90 ఏళ్ల వృద్ధుడికి జీవితఖైదు.. దళితులను చంపిన కేసులో

తంబ్.. 42 ఏళ్లు ఆలస్యంగా తీర్పు..;

Update: 2023-06-04 07:54 GMT

సరిగ్గా నడవడం కూడా చేతకాదు. చేతిలో ఉతకర్ర. కానీ న్యాయదేవత నిష్పాక్షికంగా తీర్పు చెప్పింది. చేసిన నేరానికి ఎవరికైనా సరే శిక్ష తప్పదని స్పష్టం చేసింది. దళితులను కాల్చిచంపిన కేసులో 90 ఏళ్ల పండు వృద్ధుడికి జీవిత ఖైదు పడింది. రేపోమాపో వెళ్లిపోతాడు అన్నట్టు ఉన్న అతడు జైల్లోనే చివరి శ్వాస తీయబోతున్నాడు. జీవిత ఖైదుతోపాటు హత్యాయత్నం కేసులో అతనికి పదేళ్ల జైలు శిక్ష కూడా పడింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ కోర్టు గురువారం ఈ తీర్పు వెలువరించింది. జైలుశిక్షతోపాటు రెండు కేసులకూ కలిపి రూ. 55 వేల జరిమానా కూడా విధించింది. జరిమానా చెల్లించకపోతే మరో 13 నెలలు జైల్లో ఉండాలని తీర్పిచ్చింది. తీర్పుపై బాధితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 42 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత, బతుకులు బుగ్గి అపోయాక, కనీసం దోషికి పశ్చాత్తాప పడే జీవిత కాలం కూడా మిగలకుండా తీర్పు ఇచ్చి మరింత అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

1981లో యూపీలోని మణిపురి జిల్లా సాదుపూర్‌లో రేషన్ డీలర్ గంగా దయాళ్‌కు, ఆ దళితులకు మధ్య వివాదం తలెత్తింది. దయాళ్ తన బంధుమిత్రులతో కలసి దళితులపై కాల్పులు జరిపాడు. కాల్పుల్లో 10 మంది చనిపోగా, ఇద్దరు గాయపడ్డారు. దయాళ్‌తోపాటు పదిమందిపై కేసు నమోదైంది. నిందితులు కొన్నాళ్లు జైల్లో ఉండి బెయిల్‌పై బయటికి వచ్చారు. వారిలో తొమ్మిది చనిపోగా దయాళ్ ఒక్కడే బతికి ఉన్నాడు. ఫిరోజాబాద్ కోర్టు ఆ నాటి సాక్ష్యాలను తవ్వి తీసి అతని శిక్ష విధించింది. నడవలేని స్థితిలో ఉన్న దయాళ్‌ను పోలీసులు రెక్కలు పట్టుకుని తీసుకెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags:    

Similar News