దేశంలో 96 కోట్ల మంది ఓటు హక్కుకు అర్హులే..

Update: 2024-01-27 06:21 GMT

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఓటర్లకు సంబంధించిన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. దేశంలో రానున్న ఎన్నికల్లో 96 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులని ఈసీ స్పష్టం చేసింది. కాగా వీరిలో మహిళలు 47 కోట్ల మంది ఉన్నారని తెలిపింది. అదేవిధంగా మొత్తం ఓటర్లలో 1.73 కోట్ల మంది 18-19 ఏళ్ల వయసు వారేనని వెల్లడించింది. అంతేగాక ఓటర్ల జాబితాలో నమోదైన వారిలో దాదాపు 18 లక్షల మంది దివ్యాంగులు ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇటు ఎన్నికల నిర్వహణ కోసం దేశవ్యాప్తంగా 12 లక్షల పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

దాదాపు 1.5 కోట్ల మంది పోలింగ్‌ సిబ్బందిని నియమించనున్నట్లు ఈసీ వర్గాలు తెలిపాయి. ఇక, గతేడాది రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం పంపిన ఓ లేఖ ప్రకారం..1951లో దేశంలో 17.32 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 2019 నాటికి ఈ సంఖ్య 91.20 కోట్లకు చేరుకుంది. మొదటి లోక్‌సభ ఎలక్షన్స్ లో 45 శాతం పోలింగ్‌ నమోదు కాగా గత పార్లమెంటు ఎన్నికల్లో 67 శాతంగా ఉన్నట్లు ఈసీ తెలిపింది.

Tags:    

Similar News