అలసిన శరీరానికి, మనసుకు విశ్రాంతి కావాలంటే కంటినిండ నిద్ర కంపల్సరీ. శరీరం యాక్టీవ్‌గా పనిచేయాలన్నా నిద్ర ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఒత్తిడి, ఆందోళన, అనారోగ్యం, జీవనశైలిలో మార్పుల కారణంగా చాలా మందిని నిద్రలేమి సమస్యలు వేధిస్తున్నాయి. మాములుగా ఒక రాత్రి నిద్రపోకపోతే ఆ రోజంతా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాంటిది సౌదీలోని ఓ 70 ఏళ్ల పెద్దాయన 30 ఏళ్లుగా నిద్రలేకుండా జీవితాన్ని గడిపేస్తున్నాడు. వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదా. గత 30 ఏళ్లుగా వైద్యులకు అంతు చిక్కని జబ్బు ఈ పెద్దాయనను వేధిస్తోంది.
70 ఏళ్ల సౌద్ బిన్ ముహ్మద్ అల్ ఘమ్దీ సౌదీలోని బాహా రీజియన్‌లో ఉంటున్నారు. ఈయన రిటైర్డ్ మిలిటరీ మెన్. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఈ పెద్దాయన ఓ కీలకమైన ఆపరేషన్‌లో భాగస్వామ్యులయ్యారు. ఆ సమయంలో దాదాపు 20 రోజుల పాటు నిద్ర పోకుండా ఉండాల్సి వచ్చిందట. ఆ ఆపరేషన్ తరువాత కొంత కాలానికే రిటైర్మెంట్ తీసుకున్నారు ఈ పెద్దాయన. ఇంటికి తిరిగివచ్చిన ఈయన కొద్దికాలం ఆరోగ్యంగానే ఉన్నారు. కానీ తరువాత మళ్లీ నిద్రలేమి సమస్య మొదలయ్యింది. ఒకటి కాదు, రెండు కాదు, అలా చాలా రోజులు, నెలలు, సంవత్సరాలు నిద్రలేమి సమస్య ఈయన్ను వేధించింది. అలా గత 30 ఏళ్లుగా నిద్రపోకుండానే తన జీవితాన్ని గడుపుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఆయన నిద్రపోనప్పటికీ ఎలాంటి అనారోగ్య సమస్య దరిచేరలేదు. మానసికంగా , శారీరకంగా ఎంతో స్ట్రాంగ్ గా ఉన్నారు. కానీ నిద్ర ఎందుకు పట్టడం లేదో , వ్యాధి ఏమిటో వైద్యులు నిర్ధారించలేకపోతున్నారు. దీంతో ఈయన స్టోరీ నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆయనకు పలు వైద్య సూచనలు చేస్తున్నారు.