Delhi Liquor Scam case : ఆప్ ఎంపీని అరెస్ట్ చేసిన ఈడీ

Byline :  Kiran
Update: 2023-10-04 12:33 GMT

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో మనీలాండరింగ్కు సంబంధించి మరో నేతను అరెస్ట్ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఆప్ పార్టీకి చెందిన ముగ్గురు నేతలు అరెస్ట్ అయ్యారు. లిక్కర్ స్కాం ఆరోపణలపై మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ ఇప్పటికే జైలులో ఉండగా.. తాజాగా సంజయ్ సింగ్ను అరెస్ట్ చేశారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఈడీ అధికారులు ఇవాళ సంజయ్ సింగ్ నివాసంలో సోదాలు నిర్వహించారు. మనీ లాండరింగ్‌ కేసుతో సంబంధముందన్న అనుమానంతో తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న బిజినెస్మేన్ దినేశ్‌ అరోరాతో సంజయ్‌కు పరిచయం ఉన్నట్లు ఈడీ గుర్తించింది. దీంతో బుధవారం తెల్లవారుజాము నుంచి సంజయ్‌ ఇంట్లో సోదాలు మొదలుపెట్టింది. అయితే ఈసీ సోదాల విషయాన్ని ముందుగానే గ్రహించిన సంజయ్ సింగ్ కొన్ని రోజుల క్రితమే తన ఇంటి ఎదుట ‘ఈడీకి స్వాగతం’ అని ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకలకు సంబంధించి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా 2022 జులై 20న కేంద్ర హోంశాఖకు లేఖ రాయడంతో ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. పాలసీ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన ఢిల్లీ మాజీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను సైతం 9 గంటల పాటు ప్రశ్నించింది.




Tags:    

Similar News