విపక్షాల మీటింగ్.. కాంగ్రెస్కు కేజ్రీవాల్ అల్టిమేటం

Update: 2023-06-22 13:25 GMT

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను ఓడించడమే లక్ష్యంగా విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ నివాసంలో కాంగ్రెస్ సహా వివిధ విపక్షాలు సమావేశం కానున్నాయి. ఈ భేటీలో ప్రధాని అభ్యర్థి గురించి ఎలాంటి చర్చ ఉండదని ఇప్పటికే పార్టీలు స్పష్టం చేశాయి. బీజేపీని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహం, పార్టీల మధ్య అవగాహన తదితర అంశాలపై నేతలు చర్చించనున్నారు. శుక్రవారం జరగనున్న మీటింగ్కు హాజరయ్యేందుకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పాట్నాకు చేరుకున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

కాంగ్రెస్‌కు కేజ్రీవాల్‌ అల్టిమేటం

శుక్రవారం ప్రతిపక్షాల సమావేశం నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అర్వింద్‌ కేజ్రీవాల్‌ కాంగ్రెస్‌కు అల్టిమేటం ఇచ్చారు. ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్‌ వ్యతిరేకించాలని, లేనిపక్షంలో ప్రతిపక్షాల భేటీకి తాను హాజరుకాబోమని స్పష్టం చేశారు. అంతేకాదు.. భవిష్యత్‌లో ప్రతిపక్షాల ఐక్యతకు సంబంధించిన అన్ని మీటింగ్లకు దూరంగా ఉంటామని తేల్చిచెప్పారు. ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్‌ తన వైఖరిని వెల్లడించాలని కేజ్రీవాల్ డిమాండ్‌ చేశారు.

మాయావతి చురకలు

విపక్షాల మీటింగ్పై యూపీ మాజీ సీఎం, బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ మాయావతి కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశం కేవలం చేతులు కలిపేదే తప్ప.. మనసులు కలిపేది’ కాదని కామెంట్ చేశారు. దేశాన్ని ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం, వెనకబాటుతనం, నిరక్షరాస్యత, జాతి విద్వేషాలు పీడిస్తున్నాయన్న మాయావతి ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే కాంగ్రెస్‌, బీజేపీలు డా.బీఆర్‌ అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయలేవని స్పష్టమవుతోందని అన్నారు. 80 లోక్‌సభ స్థానాలున్న యూపీ కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో అత్యంత కీలకమన్న మాయావతి అలాంటి రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని విస్మరించడం విడ్డూరమని అన్నారు. ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొస్తామంటున్న నేతలు ఆ లక్ష్యం గురించి ఆలోచించడంలేదని దీన్ని బట్టి అర్థమవుతోందని చెప్పారు. మరోవైపు బీఎస్పీని ఆహ్వానించలేదన్న కారణంతో ఆమె సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారని మిగతా పార్టీల నేతలు అంటున్నారు.


Tags:    

Similar News