ఆదిత్య ఎల్1 ప్రయోగం సూపర్ సక్సెస్..విజ‌య‌వంతంగా క‌క్ష్య‌లోకి

Byline :  Veerendra Prasad
Update: 2023-09-02 07:59 GMT

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదిత్య ఎల్‌1 లాంచింగ్‌ విజయవంతమైనట్లు ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ వెల్లడించారు. రాకెట్‌ నుంచి ఆదిత్య ఎల్‌1 విజయవంతంగా విడిపోయిందని.. దానిని కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతమవడానికి సహకరించిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. సుమారు 1.04 నిమిషాల త‌ర్వాత రాకెట్ నుంచి వేరుప‌డిన ఆదిత్య ఎల్‌1 క‌క్ష్య‌లోకి చేరింది. ఉద‌యం 11.50 నిమిషాల‌కు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన విష‌యం తెలిసిందే. నిర్దేశిత క‌క్ష్య‌లోకి ఆదిత్య ప్ర‌వేశించిన‌ట్లు ఇస్రో త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా పేర్కొన్న‌ది. ఎల్‌1 పాయింట్ దిశ‌గా ఆదిత్యుడి సౌర‌యానం మొద‌లైన‌ట్లు వెల్ల‌డించింది.

ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహాన్ని తీసుకొని PSLV-C57 వాహకనౌక శనివారం నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) తాజాగా ప్రయోగానికి వేదికైంది. ఇస్రో అంచనాల ప్రకారమే ప్రయోగం సాగుతోంది. ఆదిత్య-ఎల్‌1 గమనాన్ని షార్‌ నుంచి శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహం నాలుగు నెలలపాటు ప్రయాణించి భూమి నుంచి సూర్యుడి దిశగా ఉన్న ‘ఎల్‌1’ (లగ్రాంజ్‌) పాయింట్‌ను చేరుకోనుంది. 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఈ ప్రదేశంలోకి భారత్‌ ఉపగ్రహ ప్రయోగం చేపట్టడం ఇదే మొదటిసారి. ఈ ప్రదేశం నుంచి ఎలాంటి అవరోధాల్లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసే వీలుంది. ఇందులో 7 పరిశోధన పరికరాలున్నాయి. ఇవి సూర్యుడి పొరలైన ఫొటో స్పియర్‌, క్రోమో స్పియర్‌ సహా వెలుపల ఉండే కరోనానూ అధ్యయనం చేస్తాయి.



Tags:    

Similar News