కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీకి ఆస్పత్రిలో చేరారు. అనారోగ్యానికి గురి కావడంతో తాను ఆస్పపత్రిలో చేరానని, ఈ రోజు భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనడం లేదని ఆమె ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కోలుకున్న వెంటనే యాత్రలో చేరతానని ఆమె అన్నారు. ఈ యాత్ర బీహార్ నుంచి ఈ రోజు సాయంత్రం యూపీకి చేరనుంది.‘భారత్ జోడో న్యాయ్ యాత్ర ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించే సందర్భం కోసం నేను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. కానీ అనారోగ్యం కారణంగా ఈరోజే హాస్పిటల్‌లో అడ్మిట్ కావాల్సి వచ్చింది. యాత్ర కోసం చందౌలీ-బనారస్‌కు చేరుకున్న యాత్రికులు, యూపీ కాంగ్రెస్‌కు చెందిన నా సహచరులు, యాత్ర కోసం సన్నద్ధమవుతున్న సోదరులు అందరికీ శుభాకాంక్షలు’’ అని ప్రియాంక పోస్టులో తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న ‘భారత జోడో న్యాయ్ యాత్ర’ శుక్రవారం (ఫిబ్రవరి 16) వారణాసీ మీదుగా ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించనుంది. భాదోహి, ప్రయాగ్‌రాజ్, ప్రతాప్‌గఢ్ మీదుగా ఫిబ్రవరి 19న అమేథి లోక్‌సభ నియోజకవర్గానికి చేరుకోనుంది. నియోజకవర్గంలోని గౌరీగంజ్‌లో బహిరంగ సభలో రాహుల్ మాట్లాడనున్నారు. కాగా మరుసటి రోజు యాత్ర ప్రస్తుతం సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. కాగా ఉత్తరప్రదేశ్ తర్వాత మధ్యప్రదేశ్,ఆ తర్వాత రాజస్థాన్‌లోకి ప్రవేశించనుంది. ప్రస్తుతం రాయ్‌బరేలీ ఎంపీగా ఉన్న సోనియాగాంధీ ఇటీవలె రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపధ్యంలో మరికొన్ని రోజుల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీ వాద్రా బరిలోకి దిగనున్నారని.. కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇందు కోసమే సోనియా గాంధీ తప్పుకుని ఆ స్థానంలో ప్రియాంక గాంధీని రాజకీయాల్లోకి అరంగేట్రం చేయించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.