ఇప్పటివరకూ బైక్ రైడ్ సేవలనే అందిస్తున్న ర్యాపిడో కంపెనీ.. తాజాగా క్యాబ్ సేవల విభాగంలోకి అడుగుపెట్టినట్లు ప్రకటించింది. ఇప్పటికే బైక్ టాక్సీలలో దాదాపు 60 శాతం మార్కెట్ వాల్యూతో ఉన్న ర్యాపిడో.. తొలి ప్రయత్నంగా లక్షకి పైగా క్యాబ్‌లతో దేశంలోని ప్రధాన నగరాల్లో తన సేవలను ప్రారంభించింది. ఢిల్లీ- ఎన్‌సీఆర్, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో దాదాపు 1.2 లక్షల క్యాబ్‌లతో ర్యాపిడో ఈ సేవలను ప్రారంభించింది. 2024 సెప్టెంబరుకు వీటిని 35 నగరాలకు విస్తరిస్తామని సంస్థ సహవ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి తెలిపారు.
తమ వినూత్న SaaS-ఆధారిత ప్లాట్‌ఫారమ్ డ్రైవర్‌ల కోసం సంప్రదాయ కమీషన్ సిస్టమ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని చెప్పారు. ఎక్కువ మంది ప్రజలకు యాప్ ఆధారిత సేవలు అందించి, మార్కెట్ విస్తరించుకోవడమే తమ లక్ష్యమని అన్నారు. సున్నా కమీషన్ మోడల్‌తో డ్రైవర్ల ఆదాయం పెంచుతామని, వినియోగదారులకు భారం తగ్గేలా చూస్తామన్నారు. డ్రైవర్లు Rapido ద్వారా ఎటువంటి జోక్యం లేకుండా కస్టమర్‌ల నుండి నేరుగా చెల్లింపును పొందుతారని చెప్పారు.