మెల్లగా మాట్లాడమన్నందుకు చెంప పగలగొట్టిండు
విమానాల్లో కొందరు ప్యాసింజర్ల తీరు తరుచు వార్తల్లోకి ఎక్కుతున్నాయి. తాజాగా ఎయిరిండియాలో ఓ ప్రయాణికుడి నిర్వాకం బయటకు వచ్చింది. కాస్త మెల్లిగా మాట్లాడమన్నందుకు రెచ్చిపోయిన ప్యాసింజర్ ఎయిరిండియా ఆఫీసర్ చెంప చెళ్లుమనిపించాడు. దీంతో విమాన సిబ్బంది ఫ్లైట్ ల్యాండైన వెంటనే అతన్ని సెక్యూరిటీకి అప్పజెప్పారు.
జులై 9న ఎయిరిండియాకు చెందిన ఓ సీనియర్ అధికారి ఎయిరిండియా ఏఐ 301 విమానంలో సిడ్నీ నుంచి ఢిల్లీకి బయలుదేరాడు. బిజినెస్ క్లాస్ లో ప్రయాణిస్తున్న ఆయన సీటు సరిగా లేకపోవడంతో ఎకానమీలోకి మార్చుకున్నాడు. అయితే ఆయన పక్కన సీటులో ఉన్న ప్రయాణికుడు బిగ్గరగా మాట్లాడుతుండంతో తోటి ప్యాసింజర్లు ఇబ్బందికి గురయ్యారు. దీంతో సదరు ఆఫీసర్ మెల్లగా మాట్లాడాలని అతనికి సూచించారు. అది నచ్చని ప్రయాణికుడు ఆగ్రహానికి గురై అధికారి చెంపను పగలగొట్టాడు. ఆయన తలను వెనక్కి తిప్పే ప్రయత్నం చేశాడు. తననే మెల్లిగా మాట్లాడమంటావా అంటూ బూతులు తిట్టాడు.
ప్రయాణికుడి వద్దకు వచ్చిన ఫ్లైట్ సిబ్బంది అలా చేయొద్దని హెచ్చరించారు. తొలుత మౌఖికంగా తర్వాత రాతపూర్వకంగా హెచ్చరించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. విమానం ఢిల్లీ చేరుకున్న వెంటనే అతన్ని భద్రతా సిబ్బందికి అప్పగించారు. దీంతో సదరు వ్యక్తి లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాడు. ఈ ఘటనకు సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కు సమాచారం అందించినట్లు ఎయిరిండియా అధికారులు చెప్పారు.