మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు నెలకొంటున్నాయి. ఎన్సీపీపై తిరుగుబాటు జెండా ఎగరేసి డిప్యూటీ సీఎం అయిన అజిత్ పవార్తో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ రహస్య సమావేశమయ్యారు. ఈ సమావేశం మహా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ భేటీపై శరద్ పవార్ స్పందించారు. ఎట్టి పరిస్థితిల్లోనూ బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
ఎన్సీపీ రాజకీయ విధానం బీజేపీతో సరిపోదని పవార్ చెప్పారు. ఒక కుటుంబసభ్యుడిగా మాత్రమే అజిత్ ను కలిసినట్లు స్పష్టం చేశారు. ‘‘మా పార్టీలో కొందరు వేరే దారి ఎంచుకున్నారు. అయితే మా వైఖరిలో ఏమైనా మార్పు వస్తుందేమోనని కొందరు చూస్తున్నారు. అందుకే నన్ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మా పార్టీ బీజేపీతో ఎప్పటికీ జతకట్టదు. ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడిగా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నా’’ అని శరద్ పవార్ చెప్పారు.
అజిత్ తన కుటుంబసభ్యుడు అని.. అతడిని కలవడంలో తప్పేముందని పవార్ ప్రశ్నించారు. కాగా శరద్ పవార్ - అజిత్ పవార్‌లు పుణెలోని ఓ వ్యాపారవేత్త ఇంట్లో శనివారం భేటీ అయ్యారు. కొరేగావ్ పార్కులో ఉన్న ఇంటికి మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో వెళ్లిన శరద్ పవార్.. తిరిగి బయటకు వెళ్లిపోయారు. ఓ గంట తర్వాత అజిత్ పవర్ కారు కూడా ఆ ప్రాంగణం నుంచే బయటకు వెళ్లింది. దీంతో ఇద్దరి మధ్య రహస్య భేటీకి కారణమేంటనే విషయం చర్చనీయాంశమైంది.