తలుపులకు తాళాలు.. అజిత్‌ పవార్‌కు చేదు అనుభవం

Update: 2023-07-05 03:59 GMT

శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీని చీల్చి, బీజేపీ-శివసేన కూటమితో చేతులు కలిపిన అజిత్ పవార్‌కు మంగళవారం చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్ర సచివాలయం సమీపంలోని రాష్ట్రవాది భవన్‌ను పార్టీ వ్యవహారాల కోసం నూతన కార్యాలయంగా వాడుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. భవనాన్ని స్వాధీనం చేసుకోవడానికి అజిత్‌ పవార్‌ వర్గం నేతలు మంగళవారం అక్కడికి వెళ్లగా తలుపులకు తాళంవేసి ఉండడంతో నిరాశ చెందారు. తాళాల కోసం అనేక మందికి ఫోన్లు చేశారు. ఎట్టకేలకు ప్రవేశ మార్గంలోని తలుపు తాళాన్ని తొలగించగలిగినప్పటికీ, బంగళా లోపలి గదుల తాళాలు దొరకలేదు. ఇక చేసేదేం లేక వెనుతిరిగి వెళ్లిపోయారు.

ఆఫీసుకు తాళాలు వేయడం వెనుక ఏదో కుట్ర ఉందని ఆరోపించారు ఎన్‌సీపీ (NCP) నేత అప్పా సావంత్ . ఈ బంగళా లోపల తాము అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని, ఈ విషయాన్ని దాన్వేకు, ఆయన సిబ్బందికి కూడా తెలిపామన్నారు. తాము వస్తున్నట్లు ఫోన్ చేసి చెప్పినా.. దాన్వే పర్సనల్ అసిస్టెంట్ ఈ బంగళాకు తాళం వేసి వెళ్లాడని ఆరోపించారు.

ఈ బంగళాలో గతంలో మహారాష్ట్ర (Maharashtra) శాసన మండలిలో ప్రతిపక్ష నేత అంబాదాస్ దాన్వే ఉండేవారు. ఆయన ఉద్ధవ్ థాకరేకు విధేయుడు. ఆయనకు వేరొక బంగళాను కేటాయించారు. అజిత్ పవార్ ఈ బంగళాను తన పార్టీ కార్యాలయం కోసం ఎంపిక చేసుకున్నారు. నూతన కార్యాలయంలోకి ప్రవేశించాలని అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఏక్‌నాథ్ షిండే మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయన వర్గానికి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులు లభించాయి.




Tags:    

Similar News