ప్రధాని నరేంద్రమోదీపై హోంమంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. కేవలం 3 నెలల్లో నాలుగు విజయాలు సాధించారని అన్నారు. పార్లమెంట్ నూతన భవనం, చంద్రయాన్-3, జీ20 సదస్సు, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి నాలుగు విజయాలను అందుకున్నారని కొనియాడారు. మిగితావారు ఇవి సాధించేందుకు 50 ఏళ్లు పట్టేదని షా ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ప్రపంచానికి భారత శక్తిని చాటిచెప్పారని అన్నారు.
ఇస్రో శాస్త్రవేత్తల్లో మోదీ స్ఫూర్తి నింపారని అమిత్‌షా చెప్పారు. చంద్రయాన్ 3 విజయంతో ప్రపంచమంతా మనవైపు చూసేలా చేశారన్నారు. జీ20 సదస్సుతో ప్రపంచానికి భారత సత్తాను చాటారని అన్నారు. కొత్త పార్లమెంట్ భవనంలో అడుగుపెట్టడంతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపి చరిత్ర సృష్టించారని వ్యాఖ్యానించారు. ఇవన్నీ కేవలం 3 నెలల వ్యవధిలో పూర్తి చేశారని.. వేరేవాళ్లకైతే 50 ఏళ్లు పడుతుందన్నారు.
‘‘మోదీ అసాధ్యం అనుకున్న దానిని సుసాధ్యం చేశారు. మరుగున పడిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు కొత్త పార్లమెంట్ భవనంలో ఆమోదం దక్కేలా చేశారు. అంతరిక్ష పరిశోధనలో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపేలా ఇస్రో సైంటిస్టుల్లో స్ఫూర్తి నింపారు. చంద్రయాన్-3 ద్వారా ప్రపంచమంతా మనవైపు చూసేలా చేశారు. భారత్ నిర్వహించిన జీ20 సమావేశంలో మాత్రమే ప్రపంచ నేతలంతా ఏకతాటిపైకి వచ్చారు. రష్యా, చైనా, అమెరికా వంటి దేశాలను ఒకేతాటిపైకి తెచ్చి ఢిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించారు’’ అని అమిత్ షా ప్రశంసలు కురిపించారు.