కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ రద్దు అయ్యింది. ఆదివారం రాష్ట్రంలో షా పర్యటించాల్సి ఉంది. అయితే బిహార్ రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలతో అమిత్ షా పర్యటన రద్దు అయినట్లు తెలుస్తోంది. అంతకుముందు 3 జిల్లాల్లో షా పర్యటిస్తారని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేయడంతోపాటు అభ్యర్థులను ఫైనల్ చేస్తారని చెప్పారు. అయితే త్వరలోనే షా పర్యటనకు సంబంధించిన కొత్త తేదీలను తెలుపుతామని కిషన్ రెడ్డి తెలిపారు.
కాగా బీహార్ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మహా కూటమి సర్కార్ ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం ఉంది. కూటమి నుంచి బయటకు వచ్చేందుకు నితీష్ కుమార్ సిద్దమయ్యారు. ఆయన తిరిగి ఎన్డీయేలోకి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు సైతం పూర్తైనట్లు తెలుస్తోంది. భారతరత్న కర్పూరి ఠాకూర్ శత జయంతి కార్యక్రమంలో నితీష్ చేసిన వ్యాఖ్యలు బీహార్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కొందరు నేతలు వారసత్వ రాజకీయాలు చేస్తున్నారని పరోక్షంగా లాలూ కుటుంబాన్ని విమర్శించారు. దీంతో రెండు పార్టీల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
బీజేపీతో జతకట్టనున్న నితీష్.. ఇవాళ లేదా రేపు సీఎంగా రాజీనామా చేసే అవకాశం ఉంది. ఆదివారం బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. బీహార్ అసెంబ్లీలో 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే జేడీయూ 45, ఆర్జేడీ 79, బీజేపీకి78, కాంగ్రెస్ 19, లెఫ్ట్ పార్టీలకు 16 సీట్లు ఉన్నాయి. అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ దాటాలంటే 122 మంది ఎమ్మెల్యేలు కావాలి. అయితే ఎలాగైన అధికారం దక్కించుకోవాలని ఆర్జేడీ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు సపోర్ట్ ఇచ్చినా.. ఇంకా 8మంది సభ్యులు ఆ పార్టీకి తక్కువగా ఉన్నారు. దీంతో అధికారం కోసం లాలూ పావులు కదుపుతున్నారు.