మధ్యప్రదేశ్ లోని కునో జాతీయ పార్కులో మరో మగ చిరుత మృతి చెందింది. గత నాలుగు నెలల కాలంలో నమీబియా నుంచి భారత్ కు తెచ్చిన చీతాలలో ఇది ఏడో మరణం. గాయపడిన మగ చిరుత తేజస్ కు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. చికిత్స పొందుతూ తేజస్ ప్రాణాలు విడిచింది. అంతకుముందు కొన్ని గంటలపాటు అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా చనిపోయిన చిరుతతో కలిపి మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్‌లో మొత్తం 4 చిరుతలు, 3 చిరుత పిల్లలు మరణించాయి.
దక్షిణాఫ్రికాలోని నమీబియా నుంచి దేశానికి తీసుకొచ్చిన చిరుతలలో మగ చిరుత తేజస్ కూడా ఉంది. మే 25న కునో పార్క్‌లో 2 చిరుత పిల్లలు చనిపోయాయి. ఇప్పుడు మగ చిరుత తేజస్ చనిపోవడంతో ఆఫ్రికా దేశాల నుంచి దేశానికి తరలించిన వాటిలో చనిపోయిన చిరుతల సంఖ్య 7కు చేరింది. అనారోగ్య, ప్రతికూల వాతావరణం సహా ఇతర కారణాలతో ఆడ, మగ కలిపి నాలుగు పెద్ద చిరుతలు, మూడు చిరుత పిల్లలు చనిపోయాయి.
గత ఏడాది సెప్టెంబర్ 17న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నమీబియా నుంచి తీసుకువచ్చిన చీతాలను కునో నేషనల్ పార్కులో (Kuno National Park) వదిలివేశారు. ఆ చీతాలలో తొలి చిరుత మార్చి 27న చనిపోయింది. నమీబియా నుంచి తరలించిన చిరుతల్లో ఒకటైన సాషా ఆడ చిరుత కిడ్నీ సంబంధిత సమస్యలతో ప్రాణాలు విడిచింది. నమీబియాలో ఉన్న సమయంలోనే సాషా అనారోగ్యంతో ఉందని అధికారులు భావిస్తున్నారు. ఏప్రిల్ 13న మగ చిరుత ఉదయ్ మరణించింది. కార్డియోపల్మోనరీ ఫెయిల్యూర్ కారణంగా ఉదయ్ అనే చిరుత చనిపోయినట్లు జూ సిబ్బంది వెల్లడించారు. మరో చిరుత దక్ష్ గాయాల కారణంగా మే 9న చనిపోయింది. ప్రతికూల వాతారణ పరిస్థితులు, అనారోగ్య సమస్యలతో చిరుతులు వరుసగా చనిపోవడంపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.